రైతుబంధు గొప్ప పథకం

3 Feb, 2019 02:04 IST|Sakshi

కేంద్రం మనల్ని కాపీ కొట్టింది

హామీలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పన

నీటిపారుదల రంగానికే ప్రాధాన్యం

ఆర్థిక సంఘానికి సరైన నివేదికలు ఇవ్వాలి

కేంద్రం తరహాలో బడ్జెట్‌ రూపకల్పన

ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌తో రాష్ట్రానికి పెద్దగా ఒరిగిందేమీ లేదని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. వ్యవసాయరంగాన్ని సుభిక్షం చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని కేంద్రం కాపీ కొట్టిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ పనిని కూడా కేంద్రం సరిగా చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. రైతుబంధు తరహాలోనే కేంద్రం రైతులకు సరిపడా సాయం చేస్తే బాగుండేదని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారులు శనివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ అధికారులతో బడ్జెట్‌పై ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే దిశగా రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పన జరగాలని కేసీఆర్‌ ఆదేశించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నిధుల కేటాయింపు జరగాలని చెప్పారు. ఈ సందర్భంగా బడ్జెట్‌ రూపకల్పనపై పలు సూచనలు చేశారు. ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ప్రజలకు పలు హామీలు ఇచ్చామని, వాటి అమలుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఈ హామీల అమలు జరిగే విధంగా బడ్జెట్‌ రూపకల్పన జరగాలన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని.. వీటికి నిధుల కొరత లేకుండా బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఆర్థిక సలహాదారు జీఆర్‌ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, పంచాయతీ రాజ్‌ ముఖ్య కార్యదర్శి వికాస్‌ రాజ్, నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్, ఆర్‌ అండ్‌ బీ ఈఎన్‌సీలు గణపతి రెడ్డి, రవీందర్‌ రావు తదితరులు పాల్గొన్నారు. 
 
ఇంకా మెరుగైన పథకం కావాలి 
‘రైతుబంధు పథకం చాలా గొప్పది. రైతులకు నేరుగా సాయం చేసేలా మన పథకం ఉంది. మనం ఇచ్చే సాయం మరీ ఎక్కువ కాకున్నా రైతులకు ఊరట కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇదే పథకాన్ని కొత్తగా ప్రవేశపెట్టినట్లు చెబుతోంది. అయితే కేంద్రం ఇచ్చే సాయం తక్కువగా ఉంది. రైతులకు ఈ మొత్తం దేనికీ సరిపోదు. పెట్టుబడి సాయం విషయంలో కేంద్రం ఇప్పటికైనా ఇంకా మెరుగైన పథకం ప్రవేశపెట్టేలా యోచిస్తే బాగుంటుంది. కేంద్రం తరహాలోనే తెలంగాణ బడ్జెట్‌ను రూపొందించాలి. దీనిపై మరోసారి వివరంగా సమీక్షించుకుందాం. 15వ ఆర్థిక సంఘం రాష్ట్ర పర్యటనకు వస్తోంది. మన రాష్ట్రం ఎక్కువ నిధులు పొందేలా సమగ్ర నివేదిక రూపొంచాలి. దీనిపై దృష్టి పెట్టండి. గ్రామపంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా మన ప్రణాళిక ఉండాలి. వచ్చే ఐదేళ్లల్లో అన్ని గ్రామాల్లో మెరుగైన మౌలిక వసతులు ఉండాలి. బడ్జెట్‌ రూపకల్పనలో ఈ దిశగా చర్యలు తీసుకోవాలి’అని సీఎం అన్నారు.  
 
18న ఆర్థిక సంఘం రాక 
15వ ఆర్థిక సంఘం ఈ నెల 18న తెలంగాణకు రానుంది. మూడ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. మొదటి రెండ్రోజులు సీఎం కేసీఆర్‌తో, రాష్ట్రంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం కానుంది. 20న రాష్ట్రంలో పర్యటించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనుంది. మిషన్‌ భగీరథ పనులను పరిశీలించనుంది. ఆర్థిక సంఘం పర్యటన ముగిసిన తర్వాతే బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం తరహాలోనే రాష్ట్రంలోనూ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. అప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. 
 
సాగుకు 25వేల కోట్లు! 
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు ఈసారి కూడా గతేడాదిలాగే భారీగా బడ్జెట్‌ కేటాయింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టుల పనుల్లో ప్రస్తుత పురోగతి, వాటి ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుంటూ రూ.25 వేల కోట్ల బడ్జెట్‌ను సర్దుబాటు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. నీటిపారుదల శాఖ గతంలో పంపిన బడ్జెట్‌ ప్రతిపాదనలను పరిశీలించిన ఆర్థికశాఖ రూ.25 వేల కోట్లకు సీలింగ్‌ ఇచ్చింది. సాగునీటి ప్రాజెక్టులకు ఈ ఏడాది జనవరిలో నీటిపారుదల శాఖ రూ.26,700 కోట్లతో ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. చాలా ప్రాజెక్టుల పరిధిలో నెలకొన్న భూసేకరణ, సహాయ పునరావాస, అటవీ, పర్యావరణ సమస్యలు, గతేడాది పనుల పురోగతిని దృష్టిలో పెట్టుకొని ఈ మేర నిధులు అవసరమని తెలిపింది. దీనిపై ప్రాజెక్టుల వారీగా సమీక్ష జరిపిన అనంతరం రూ.25వేల కోట్ల బడ్జెట్‌కే ఆర్ధిక శాఖ సీలింగ్‌ ఇచ్చింది. ఇందులో రూ.1,316.13 కోట్లు నిర్వహణ పద్దుకై ప్రతిపాదించగా, మిగతా 23,683.87 కోట్లు ప్రగతి పద్దుకై ప్రతిపాదించారు.

ప్రగతి పద్దు కింద ప్రతిపాదించిన నిధుల్లో రాష్ట్ర ప్రణాళిక కింద రూ.13,253.77 కోట్లు కేటాయించేలా ప్రతిపాదనలు సిధ్ధం కాగా.. మిగతా రూ.10,430.10కోట్లను ఇప్పటికే ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల ద్వారా రుణాల రూపంలో తీసుకోవాలని ప్రతిపాదించారు. ఇక ప్రాజెక్టుల వారీగా చూస్తే అంతా ఊహిస్తున్నట్లే కాళేశ్వరం ప్రాజెక్టుకు గరిష్టంగా రూ.5,988.10 కోట్లు కేటాయించాలని, సీతారామకు రూ.2,915కోట్లు, పాలమూరు–రంగారెడ్డికి రూ.2,732కోట్లు, మైనర్‌ ఇరిగేషన్‌కు రూ.1,601కోట్లు కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కాగా, సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్‌ బిల్లులు, బడ్జెట్‌ కేటాయింపులపై సీఎం కేసీఆర్‌ శనివారం బడ్జెట్‌పై సమీక్ష సందర్భంగా అధికారులతో చర్చించారు. వచ్చే బడ్జెట్‌లో రూ.25వేల కేటాయింపులకు ఓకే చెప్పినట్లుగా తెలిసింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు రుణాల ప్రక్రియను వేగిరం చేయాలని సూచించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.  

నేడు యాదాద్రికి సీఎం
ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదివారం యాదాద్రికి వెళ్లనున్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని యాదాద్రి ఆలయంలో జరుగుతున్న ఆలయ విస్తరణ పనులను అధికారులతో కలిసి పరిశీలించనున్నారు. అనంతరం అభి వృద్ధి పనులపై అధికారులతో సమీక్షించనున్నారు. కేసీఆర్‌ రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి యాదాద్రికి వెళ్తున్నారు.
 

మరిన్ని వార్తలు