మల్లన్నా.. గిదేందన్నా!

28 May, 2020 06:22 IST|Sakshi

ప్రభుత్వ ఆస్పత్రి గిట్లుందేంది!!   

చెత్తా చెదారంతో నిండుకుంది  

శామీర్‌పేట ఠాణా మస్తుగుంది

పీహెచ్‌సీ ఆవరణలో చెట్లు పెంచండి  

మంత్రి మల్లారెడ్డికి సీఎం కేసీఆర్‌ ఫోన్‌

శామీర్‌పేట్‌: అది బుధవారం మధ్యాహ్నం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌కు రాజీవ్‌ రహదారిపై భద్రత బలగాల మధ్య వాహనంలో వెళ్తున్నారు.. రాజీవ్‌ రహదారికి ఆనుకుని ఉన్న మేడ్చల్‌– మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండల కేంద్రంలోని పోలీస్‌ ఠాణా ఆవరణలోని ఏపుగా ఎదిగిన పచ్చని చెట్లను చూసి ఆయన అబ్బురపడ్డారు.ఆ సమీపంలోనే ఉన్న పీహెచ్‌సీ చెత్తా చెదారంతో నిండుకుని ఉన్న దృశ్యం సైతం సీఎం దృష్టిలో పడింది. వెంటనే ఆ జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డికి ఫోన్‌ చేశారు. మంత్రిగారూ.. ఏమిటిది? ప్రభుత్వ ఆస్పత్రి ఇలాగేనా ఉండేది? ఇంత నిర్లక్ష్యమైతే ఎలా? అంటూ ప్రశ్నించారు. పీహెచ్‌సీపై స్థితిగతులపై ఆయన ఆరా తీశారు.

వెంటనే అక్కడ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. దీంతో స్పందించిన  మంత్రి మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్‌ వాసం వేంకటేశ్వర్లు అధికారులు ఆస్పత్రిని సందర్శించారు. పీహెచ్‌సీ పరిసరాలను పరిశీలించారు. మొక్కలు నాటి, పచ్చదనం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆస్పత్రిని వీలైనంత త్వరగా అభివృద్ధి పరుస్తామని చెప్పారు. కాగా.. శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలను పచ్చని మణిహారంగా తీర్చిదిద్దిన పోలీస్‌ అధికారి, ఆరు నెలల క్రితం వరకు ఇక్కడ విధులు నిర్వర్తించిన సీఐ నవీన్‌రెడ్డి గురించి సీఎం ఆరా తీసినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు