60 రోజుల ప్రోగ్రెస్‌ రిపోర్టు

6 Nov, 2018 01:34 IST|Sakshi

పార్టీ ప్రచార సరళిపై  సమీక్షిస్తున్న టీఆర్‌ఎస్‌ అధినేత

అభ్యర్థుల ప్రచార తీరుపై నియోజకవర్గాలవారీగా నివేదికలు

దీపావళి తర్వాత పూర్తిస్థాయి ప్రచార బరిలోకి

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికల కోసం సెప్టెంబర్‌ 6న అసెంబ్లీని రద్దు చేయడంతోపాటు అదే రోజున 105 మంది పార్టీ అభ్యర్థులను ప్రకటించి రెండు నెలలైన నేపథ్యంలో ప్రచార సరళిపై టీఆర్‌ఎస్‌ అధినేత సమీక్షిస్తున్నారు. నియోజకవర్గాలవారీగా పరిస్థితులను తెలుసుకునేందుకు వివిధ మార్గాల్లో సమాచారం సేకరిస్తున్నారు. సెగ్మెంట్లవారీగా తాజా రాజకీయ పరిస్థితులు, ప్రత్యర్థి పార్టీల తీరు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు సాగిస్తున్న ప్రచారం, ప్రజల నుంచి వ్యక్తమవుతున్న స్పందన వంటి అంశాలపై నివేదికలు తెప్పించుకుంటున్నారు. వాటిని పరిశీలిస్తూ నియోజకవర్గాలవారీగా అనుసరించే ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. ఆ నివేదికల ఆధారంగా అభ్యర్థులకు సూచనలు ఇవ్వడంతోపాటు అక్కడి సభలకు వెళ్లినప్పుడు ఏయే అంశాలను ప్రస్తావించాలో జాబితాను సిద్ధం చేస్తున్నారు. రెండు నెలలుగా సాగిన ప్రచార సరళిపై వివిధ సంస్థల నుంచి సేకరించే సమాచారం ఆధారంగా స్థానిక అంశాలను అందులో పొందుపరుస్తున్నారు.

లోకల్‌ అంశాలకు ప్రాధాన్యత...
మహాకూటమి అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే పూర్తిస్థాయి ప్రచారంలోకి దిగాలని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిర్ణయించారు. దీపావళి తర్వాత కేసీఆర్‌ బహిరంగ సభలు మళ్లీ మొదలుకానున్నాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల బహిరంగ సభలు నిర్వహించిన తర్వాత నియోజకవర్గాలవారీగా బహిరంగ సభలు, రోడ్‌షోలు నిర్వహించాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్‌ కోసం ఇప్పటికే హెలికాప్టర్, బస్సును ఏర్పాటు చేశారు. ఈసీ నుంచి వాటి వాడకం కోసం అనుమతి తీసుకున్నారు. 2014 ఎన్నికల ప్రచారం తరహాలోనే నియోజకవర్గాలవారీగా స్థానిక అంశాలను కేసీఆర్‌ తన ప్రచారంలో ప్రస్తావించనున్నారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు అంశాలను తన ప్రసంగాల్లో ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. నాలుగేళ్ల పాలనలో రాష్ట్రస్థాయిలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే స్థానిక అంశాలను ప్రస్తావించేలా టీఆర్‌ఎస్‌ అధినేత ప్రచారం సాగనుంది.
 
గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల గవర్నర్‌ ఇ.ఎస్‌. ఎల్‌. నరసింహన్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తాజా రాజకీయ పరిణామాలపై వారిద్దరూ చర్చించినట్లు తెలిసింది. కేసీఆర్‌ వెంట కరీంనగర్‌ లోక్‌సభ సభ్యుడు బి. వినోద్‌ కుమార్‌ ఉన్నారు.  

వంద సభలు...
టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రచార ప్రణాళిక సిద్ధమైంది. వంద సభలకు తగ్గకుండా కేసీఆర్‌ హాజరయ్యేలా దీన్ని రూపొందించారు. హెలికాప్టర్‌లోనే ఎక్కువ సభలకు ఆయన హాజరుకానున్నారు. హైదరాబాద్‌ మినహా అన్ని జిల్లా కేంద్రాల్లో... రామగుండం వంటి నగరాలు, ఇతర పట్టణాల్లోనూ బస్సులో రోడ్‌షో నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తంగా సుడిగాలి పర్యటన ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా అనుకూల చర్చ జరిగేలా టీఆర్‌ఎస్‌ అధినేత ప్రచార ప్రణాళిక సిద్ధమైంది. ఈ ప్రచారం ప్రారంభించడానికి ముందే పెండింగ్‌లో ఉన్న 12 స్థానాలకు కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించనున్నారు.
 

మరిన్ని వార్తలు