ఆ ఓటు మళ్లీ పడాలి

24 Mar, 2019 01:00 IST|Sakshi

అసెంబ్లీ ఓటర్లు మళ్లీ మనవైపే వచ్చేలా చూడాలి.. లోక్‌సభ ఇన్‌చార్జీలతో కేసీఆర్‌

పోలింగ్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టాలి 

మంత్రులకు, పార్టీ ముఖ్యులకు బాధ్యతలు 

అసెంబ్లీ ఎన్నికల తరహాలో ప్రచారం 

ఏప్రిల్‌ 4 వరకు వరుసగా బహిరంగ సభలు 

ఆదిలాబాద్‌ సెగ్మెంట్‌ మినహా మిగిలినచోట్ల షెడ్యూల్‌ ఖరారు

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ వ్యూహం సిద్ధం చేసింది. 16 స్థానాల్లో కచ్చితంగా విజయం సాధించేలా సీఎం కేసీఆర్‌ ప్రణాళిక రూపొందించారు. కేసీఆర్‌తోపాటు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. అధికార పార్టీ ఎన్నికల వ్యూహం అమలును పర్యవేక్షిస్తున్నారు. ప్రచార సభలతోపాటు పోలింగ్‌ నిర్వహణ విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలని మంత్రులకు, పార్టీ ముఖ్యులకు కేసీఆర్‌ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేసిన ప్రతి ఒక్కరూ మళ్లీ ఓటేసేలా చూడాలని ఆదేశించారు. ఖమ్మం, మహబూబాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు భారీ ఆధిక్యత వచ్చేలా వ్యూహం అమలు చేయా లన్నారు. లోక్‌సభ ఎన్నికలంటే ఓటర్లలో సహజంగా ఉండే అనాసక్తిని తొలగించేందుకు ప్రచా రంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్‌ శాతం ఎంత పెరిగితే టీఆర్‌ఎస్‌ అనుకూల ఓట్లు అంత పెరుగుతాయని.. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ శాతం పెరిగేలా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. 

నల్లగొండ సెగ్మెంట్‌ నుంచి..
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ ఈ నెల 29 నుంచి పూర్తి స్థాయిలో ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 17న కరీంనగర్‌ నుంచి ఎన్నికల ప్రచా రం ప్రారంభించారు. 19న నిజామాబాద్‌ బహి రంగసభలో పాల్గొన్నారు. 29న నల్లగొండ  లోక్‌సభ సెగ్మెంట్‌ నుంచి పూర్తిస్థాయి ప్రచారం ప్రారంభించనున్నారు. ఏప్రిల్‌ 4 వరకు సీఎం కేసీఆర్‌ ప్రచార షెడ్యూల్‌ సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఒకేరోజు రెండుమూడు లోక్‌సభ సెగ్మెంట్లలో ప్రచారం నిర్వహించనున్నారు. 16 సీట్లలో గెలుపు లక్ష్యంగా పెట్టుకున్న కేసీఆర్‌ ఇప్పటికే రెండు సెగ్మెంట్లలో ప్రచారం పూర్తి చేశారు. మరో 13 సెగ్మెంట్లలో ప్రచార షెడ్యూల్‌ను శనివారం ఖరారు చేశారు. ఆదిలాబాద్‌లో ప్రచారసభ నిర్వహణ తేదీని ఇంకా నిర్ణయించలేదు. చేవేళ్ల లోక్‌సభ సెగ్మెంట్‌లోని దాదాపు సగం మంది ఓటర్లు ఉండే నగర ప్రాంత ప్రచారసభను మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌ సెగ్మెంట్లతో కలిపి నిర్వహించనున్నారు. చేవేళ్ల సెగ్మెంట్‌లోని గ్రామీణ ఓటర్ల బహిరంగసభను వికారాబాద్‌లో నిర్వహించే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. 
 
ఇదీ కేసీఆర్‌ షెడ్యూల్‌ 
– మార్చి 29న సాయంత్రం 4గంటలకు నల్లగొండ లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని సూర్యాపేట బహిరంగసభలో పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం 5గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, చేవేళ్ల (కొంత భాగం) లోక్‌సభ సెగ్మెంట్ల ఉమ్మడి బహిరంగసభలో ప్రసంగిస్తారు. 
– మార్చి 31న సాయంత్రం 4గంటలకు నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ సెగ్మెంట్‌లోని వనపర్తి బహిరంగసభలో పాల్గొంటారు. సాయంత్రం ఐదున్నర గంటలకు మహబూబ్‌నగర్‌లో బహిరంగసభకు హాజరవుతారు. 
– ఏప్రిల్‌ 1న సాయంత్రం 4గంటలకు పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్‌లోని రామగుండంలో ప్రచారసభలో పాల్గొంటారు. 
– ఏప్రిల్‌ 2న సాయంత్రం నాలుగు గంటలకు వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచార బహిరంగసభలో ప్రసంగిస్తారు. అదేరోజు సాయంత్రం ఐదున్నర గంటలకు భువనగిరిలో జరగనున్న భువనగిరి లోక్‌సభ సెగ్మెంట్‌ ఎన్నికల ప్రచారసభలో పాల్గొంటారు. 
– ఏప్రిల్‌ 3న సాయంత్రం 4గంటలకు ఆందోల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ బహిరంగసభకు హాజరవుతారు. అదేరోజు సాయంత్రం 5:30గంటలకు నర్సాపూర్‌లో జరగనున్న మెదక్‌ లోక్‌సభ సెగ్మెంట్‌ ప్రచారసభలో పాల్గొంటారు. 
– ఏప్రిల్‌ 4న సాయంత్రం 4గంటలకు మహబూబాబాద్‌లో జరగనున్న ప్రచారసభలో పాల్గొంటారు. అనంతరం 5:30గంటలకు ఖమ్మం సెగ్మెంట్‌ బహిరంగసభకు హాజరవుతారు. 
 
మంత్రులకు బాధ్యతలు 
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపువ్యూహం అమలు బాధ్యతను ఆయా జిల్లాల ఇంచార్జ్‌ మంత్రులకు కేసీఆర్‌ అప్పగించారు. ప్రతి లోక్‌సభ సెగ్మెంట్‌కు ఒక మంత్రితోపాటు టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర బాధ్యులను నియమించారు. మంత్రులు, పార్టీ బాధ్యులు సమన్వయంతో గెలుపు వ్యూహాన్ని అమలు చేయనున్నారు. సీఎం కేసీఆర్‌ స్వయంగా ఖమ్మం, మెదక్‌ బాధ్యతలను చూస్తారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో భాగంగా ఉండే జహీరాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్‌ ఎన్నికల బాధ్యతలను సీఎం కేసీఆర్‌తోపాటు వేముల ప్రశాంత్‌రెడ్డి పర్యవేక్షించనున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జి.జగదీశ్‌రెడ్డి, సీహెచ్‌ మల్లారెడ్డిలకు మూడు లోక్‌సభ సెగ్మెంట్ల చొప్పున బాధ్యతలను అప్పగించారు. రెండు, మూడు లోక్‌సభ సెగ్మెంట్లు మినహా అన్నింటికీ టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను ఎన్నికల బాధ్యులుగా నియమించారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల వ్యూహం అమలును సమన్వయం చేయడంతోపాటు చేవేళ్ల, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్లల్లో పార్టీ వ్యూహాన్ని స్వయంగా పర్యవేక్షించనున్నారు. 

>
మరిన్ని వార్తలు