ఏం చేయబోతామన్నది త్వరలో చూపిస్తాం: కేసీఆర్‌

11 Dec, 2018 17:49 IST|Sakshi

హైదరాబాద్‌: త్వరలోనే దేశ రాజకీయాల్లో సమూల మార్పులు చూస్తారని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అతి పెద్ద మెజారిటీతో మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న తరుణంలో తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేసీఆర్‌ మాట్లాడారు. దేశ రాజకీయాల్లో మార్పులు చూడబోతున‍్నారన్న కేసీఆర్‌.. ఏం చేయబోతామన్నది త్వరలో చేసి చూపిస్తామన్నారు. దేశంలో 15 కోట్ల మంది రైతులు ఉంటే, వారంతా అన్నమో రామచంద్రా అంటూ ఉన్నారని, ఈ దేశంలో 70వేల టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉన్నప‍్పటికీ 30 వేల టీఎంసీల నీరు మాత్రమే వాడుకోవడం నిజంగా సిగ్గుచేటన్నారు.పార్టీ గెలిచిందని శ్రేణులు ఎవ్వరూ కూడా అతిగా వ్యవహరించవద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు. ముఖ్యంగా వినయం, విధేయత అనేది అవసరమన్నారు. ఇది సకల జనులు తమకు అందించిన విజయంగా కేసీఆర్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, గిరిజనులు, దళితులతో పాటు ప్రతీ ఒక్కరూ తమ భారీ విజయంలో సహకరించారన్నారు.

‘అంతిమ తీర్పు ప్రజలు అప్పగించారు కాబట్టి.. ఆ సమయాన్ని ప్రజా సేవచేయడానికి కేటాయించాలి. ఎన్నికల్లో ప్రత్యర్థులు ఎన్ని ఎదురుదాడులకు దిగినప్పటికీ అవన్నీ గతం. నేను ప్రజలకు చెప్పిందొకటే టీఆర్‌ఎస్‌ వస్తే కాళేశ్వరం వస్తది.. కూటమిని గెలిపిస్తే శనిశ్వరం వస్తది అని చెప్పిన. ప్రజలు మాకు కాళేశ్వరమే కావాలంటూ తీర్పునిచ్చారు. తెలంగాణలో నిశ్చితంగా ధనిక రైతాంగం ఉందనేవిధంగా పనిచేస్తాం. గిరిజనులు, గిరిజనేతరులు పోడు భూములు కోసం కష్టపడుతున్నారు. ఇందుకు పరిష్కారం వచ్చే దిశగా ప్రయత్నిస్తా.  కులవృత్తులు అన్నీ కుదుటపడే విధంగా చర్యలు చేపడతాం. యువతలో నిరుద్యోగ సమస్య అనేది తీవ్రంగా ఉంది. ఇది యావత్‌ దేశంలో ఉన్న సమస్యే.. కానీ యువతకు సాధ్యమైనన్ని ఎక్కువ ఉద్యోగాలు వచ్చేవిధంగా ముందుకు సాగుతాం. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్‌ను వేస్తాం. ప్రభుత్వ ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. తెలంగాణలో ప్రజల సంపూర్ణ ఆరోగ్యం దిశగా కృషి చేస్తాం. దళితులు, గిరిజనుల పేదరికాన్ని రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటాం. ఎవరి సమస్య అయినా సమస్యే కాబట్టి..  ప్రజాసమస్యలే కేంద్ర బిందువుగా పనిచేస్తాం’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.


కేసీఆర్‌ ఇంకా ఏమన్నారంటే..

  • బీజేపీ, కాంగ్రెస్‌యేతర ఫ్రంట్‌ ఏర్పాటులో టీఆర్‌ఎస్‌ ప‍్రధాన పాత్ర పోషిస్తుంది
  • సింగిల్‌ బూత్‌లో రీపోలింగ్‌ లేకుండా పోలింగ్‌ సాగింది
  • సీఈవో రజత్‌ కుమార్‌కు ధన్యవాదాలు
  • మీడియా కూడా కాంక్రీట్‌ రోల్‌ ప్లే చేసింది
  • తెలంగాణలో ఎన్నికల సందర్భంగా పూర్తిస్థాయి పరిపూర్ణతను ప్రదర్శించడంలో మనం సఫలీకృతం అయ్యాం
  • మన గడ్డ చాలా చైతన్యవంతమైన గడ్డ
  • ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు అనే చెప్పా.. అదే విధమైన తీర్పు ఇచ్చారు
  • ఇక్కడ ప్రజలే గెలిచారు...
  • ఇక్కడ నుంచి మేము కోరుతున్నది.. జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించడమే
  • దేశ రాజకీయాలకు కొత్త అర్థం చెబుతాం
  • జాతీయ రాజకీయాల్లో మార్పు రాకపోతే దేశం క్లిష్టస్థితిలోకి వెళుతుంది
  • మేము ఎవ్వరికీ బాస్‌లం కాదు
  • మేము తెలంగాణ ప్రజలకు ఏజెంట్‌లు మాత్రమే
  • ఖమ్మంలో మా కత్తి మాకే తగిలింది
  • లేకపోతే ఇంకా మరికొన్ని సీట్లు గెలిచేవాళ్లం
  • నా మిత్రుడు అసదుద్దీన్‌ ఒవైసీకి ధన్యవాదాలు
  • నిన్న ఒవైసీతో దేశంలోని మైనార్టీలను ఏకం చేయడం ఎలా అనే దానిపైనే చర్చించాం
  • రాజస్తాన్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గెలిచింది..
  • ఇంకో దిక్కలేక కాంగ్రెస్‌ గెలిచింది.
  • ఈ దేశంలో తాగడానికి సరైన తాగు  నీరు లేదు
  •  70 ఏళ్ల స్వాతంత్ర్య దేశంలో ఇంకా తాగు  నీరుకు, సాగు నీరుకు ఇబ్బంది పడటం నిజంగా సిగ్గుచేటు
  • నాలుగు పార్టీలను ఏకం చేయడం రాజకీయం కాదు
  • బీజేపీ ముక్త్‌ భారత్‌.. కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ కావాలి
  • కొన్ని రాజకీయ పార్టీలు నీచ రాజకీయాలు  చేశాయి
మరిన్ని వార్తలు