జిల్లాకో బహిరంగ సభ

21 Sep, 2018 07:31 IST|Sakshi

ప్రతి సభకు లక్ష మంది సమీకరణ

ఈ నెల 25 తర్వాత మొదటి సభ

తర్వాత దశలో నియోజకవర్గాలవారీగా...

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలకంటే ముందుండేలా టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. 50 రోజుల్లో 100 సభల నిర్వహణకు ముందుగా... ప్రతి జిల్లాలో ఒక బహిరంగ సభ నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. ఈ నెల 25 తర్వాత 3–4 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకటి చొప్పన బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతి సభకు లక్ష మంది ప్రజలు హాజరయ్యేలా చూడాలని భావిస్తున్నారు. ఎన్నికల వ్యూహ రచనలో నిమగ్నమైన గులాబీ దళపతి... బహిరంగ సభల నిర్వహణపై ముఖ్య నేతలకు ఆదేశాలిచ్చారు. ప్రతి జిల్లాలో నిర్వహించే ఈ బహిరంగ సభల విజయవంతంపై అంతర్గతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏయే జిల్లాల్లో ఏ రోజు సభ నిర్వహించాలనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇలా ప్రతి జిల్లాలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహించడం ద్వారా పార్టీ ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు ఎన్నికలకు సన్నద్ధమవుతారని అధిష్టానం భావిస్తోంది.

గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపులో ప్రచార వ్యూహమే కీలక పాత్ర పోషించింది. బంగారు తెలంగాణ నినా దంతో కేసీఆర్‌ బహిరంగ సభలు నిర్వహించారు. ఇప్పుడూ అదే తరహాలో వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ రద్దు జరిగిన రోజునే ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థి పార్టీలను అయోమయానికి గురి చేసిన కేసీఆర్‌.. 50 రోజుల్లో 100 నియోజకవర్గాల్లో సభలు నిర్వంచనున్నట్లు అదే రోజు ప్రకటించారు. అసెంబ్లీ రద్దు జరిగిన మర్నాడే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ‘ప్రజా ఆశీర్వాద సభ’పేరిట బహిరంగ సభ నిర్వహించడం ద్వారా కేసీఆర్‌ ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వెంటనే వరుసగా సభలు ఉంటాయని టీఆర్‌ఎస్‌ నేతలు, శ్రేణులు భావించారు. అయితే ప్రచార సభలకు కొంత అంతరం ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదం పొందేలా కేసీఆర్‌ వ్యూహాన్ని సిద్ధం చేస్తుండటంతో నియోజకవర్గాల్లో వరుస బహిరంగ సభల నిర్వహణకు ఒకింత ఆలస్యమవుతోందని టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే వీలైనన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలను నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ అధినేత భావిస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఏ రోజు సభ ఉండాలనే విషయంలోనూ ప్రణాళిక సిద్ధమైనట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు