అసెంబ్లీ రద్దుకు మంత్రి మండలి తీర్మానం.. ఉత్కంఠకు తెర

6 Sep, 2018 01:27 IST|Sakshi

గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు కేబినెట్‌ భేటీ 

ఆ వెంటనే గవర్నర్‌ను కలసి సభ రద్దుకు సిఫారసు  

తీర్మాన కాపీని నరసింహన్‌కు అందజేయనున్న సీఎం కేసీఆర్‌ 

అనంతరం గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు నివాళులు 

టీఆర్‌ఎస్‌ భవన్‌లో మీడియాతో మాట్లాడనున్న టీఆర్‌ఎస్‌ అధినేత

అసెంబ్లీ రద్దు అనంతరం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌!

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర శాసనసభ రద్దుకు ముహూర్తం ఖరారైంది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై ఈ మేరకు తీర్మానం చేస్తుంది. అయితే కేబినెట్‌ సమావేశానికి సంబంధించిన ఎజెండాను సాధారణ పరిపాలన శాఖ ఇప్పటివరకూ మంత్రులకు పంపలేదు. ప్రగతి భవన్‌లో సమావేశానికి రాగానే జీఏడీ అధికారులు ఎజెండా కాపీలను మంత్రులకు అందజేస్తారు. ఆ వెంటనే శాసనసభ రద్దు సిఫారసుకు సంబంధించిన తీర్మానంపై మంత్రుల సంతకాలు తీసుకుంటారు. ఈ కసరత్తు పూర్తయ్యేలోపు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు శాసనసభ రద్దు, ఎన్నికలు ఎప్పుడు వస్తాయన్నదానిపై అమాత్యులకు సమాచారం ఇస్తారని తెలుస్తోంది.

గురువారం ఉదయం హైదరాబాద్‌లో అందుబాటులో ఉండాలని మాత్రమే ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు మంత్రులకు సూచించారు. మంత్రివర్గ సమావేశం ఎప్పుడు ఉంటుంది? ఎజెండా ఏమిటన్న విషయాలు మాత్రం గోప్యంగానే ఉంచారని ఓ సీనియర్‌ మంత్రి బుధవారం రాత్రి ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు. జీఏడీ అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం.. మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రివర్గ సమావేశం ఉంటుంది. 1–30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్‌భవన్‌ వెళ్లి గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి కేబినెట్‌ తీర్మానం కాపీని అందజేస్తారు. అనంతరం గన్‌పార్క్‌ వద్దకు చేరుకుని తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం రెండు గంటలకు కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ భవన్‌కు చేరుకుని మీడియా సమావేశంలో మాట్లాడతారు. శాసనసభ రద్దుకు సంబంధించి గురువారం సాయంత్రం ప్రకటన వెలువడగానే.. శుక్రవారం ఉదయం సిద్దిపేట జిల్లాకు బయలుదేరి వెళతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం తరువాత హుస్నాబాద్‌కు చేరుకుంటారు. బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.  

నేటి సాయంత్రం నుంచి ఆపధర్మ ప్రభుత్వం
శాసనసభ రద్దుకు సంబంధించి గవర్నర్‌ నరసింహన్‌ సాయంత్రం నోటిఫికేషన్‌ విడుదల చేస్తారని, అదేసమయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని కేసీఆర్‌ను కోరతారని అధికార వర్గాలు వెల్లడించాయి. శాసనసభ రద్దయిన వెంటనే 119 మంది ఎమ్మెల్యేలు తమ సభ్యత్వం కోల్పోతారు. అయితే ముఖ్యమంత్రి, మంత్రివర్గ సహచరులు యధావిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. వారి జీతభత్యాలు, అలవెన్సుల్లో కూడా ఎలాంటి మార్పు ఉండదు. ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే దాకా ఆపధర్మ మంత్రిమండలిగా కొనసాగాలని గవర్నర్‌ తన నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆపధర్మ ప్రభుత్వానికి అధికారాలు ఉండవు. 2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ ఐఎంజీ సంస్థకు క్రీడా మైదానాలు కేటాయించడాన్ని న్యాయస్థానాలు తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయాలను న్యాయస్థానాలు రద్దు చేయడమే కాకుండా కేర్‌టేకర్‌ ప్రభుత్వం దైనందిన ప్రభుత్వ కార్యకలాపాలకు విఘాతం కలుగకుండా చూడాలే తప్ప విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదని వ్యాఖ్యానించింది. వచ్చే శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్‌ వెలువడేదాకా మంత్రులు అధికారిక పర్యటనలతో పాటు ప్రభుత్వ అతిథి గృహాల్లో బస చేయవచ్చు.

ఆ నాలుగు రాష్ట్రాలతోనే ఎన్నికలు.. 
శాసనసభ రద్దుకు సంబంధించి నోటిఫికేషన్‌ వెలువడిన మరుక్షణం దాని కాపీని ఇక్కడి ముఖ్య ఎన్నికల అధికారి ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి చేరవేసేలా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. వచ్చే వారం టీఆర్‌ఎస్‌ ఎంపీల బృందం ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని కలసి వీలైనంత త్వరగా శాసన సభకు ఎన్నికలు నిర్వహించాలని కోరనుంది. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం మొదలైన నేపథ్యంలో సెప్టెంబర్‌ 1వ తేదీ నాటి జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలని ఎంపీలు విన్నవించనున్నారు.

డిసెంబర్‌లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరంలతో పాటే తెలంగాణకు ఎన్నికలు నిర్వహించాలని ఈసీ యోచిస్తోంది. శాసనసభ రద్దు నోటిఫికేషన్‌ అధికారికంగా అందిన వెంటనే ఎన్నికల కమిషన్‌ దీనికి సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ లోక్‌సభ సభ్యుడొకరు వెల్లడించారు. ఓటర్ల జాబితాలో తమ పేరు లేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే పరిశీలించి జాబితాలో చేర్చడానికి ప్రత్యేకంగా ఒక గడువును నిర్దేశించే అవకాశం ఉంది. అక్టోబర్‌ 1 నుంచి 15 తేదీల మధ్య ఈ షెడ్యూల్‌ ఉండొచ్చని సమాచారం.

మరిన్ని వార్తలు