నల్లగొండలో ప్రచార వే‘ఢీ’..!

16 Oct, 2019 10:50 IST|Sakshi

రేపు హుజూర్‌నగర్‌ బహిరంగ సభకు సీఎం కేసీఆర్‌ రాక

18, 19 తేదీల్లో ఎంపీ రేవంత్‌రెడ్డి రోడ్డు షో     

సాక్షి, సూర్యాపేట : హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ప్రచా రానికి ఈ నెల 19 సాయంత్రంతో తెరపడనుంది. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. చివరగా ముఖ్యనేతలను ప్రచారానికి దింపుతున్నాయి. గురువారం ముఖ్య మంత్రి కేసీఆర్‌ హుజూర్‌నగర్‌లో నిర్వహిస్తున్న బహిరంగ సభకు హాజరవుతున్నారు. 18, 19 తేదీల్లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి రోడ్డు షో ఖరారైంది. బీజేపీ, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు సుడిగాలి ప్రచారాన్ని మార్మోగిస్తున్నారు.

హుజూర్‌నగర్‌లో 17న టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ..
సీఎం కేసీఆర్‌.. ఈనెల 17న హుజూర్‌నగర్‌ సమీపంలోని ఫణిగిరి గుట్టకు వెళ్లే రోడ్డులో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2గంటలకు సీఎం ఈ సభలో పొల్గొం టారు. ఈ నేపథ్యంలో సభా ఏర్పా ట్లు చకచకా సాగుతున్నాయి. మం త్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, పార్టీ నేతలు సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించారు. చివరి ప్రచార అంకంలో కేసీఆర్‌ సభకు భారీ జనసమీకరణకు ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి వేలాది మందిని సభకు తరలించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సభకు తరలిరావాలని గ్రామాలు, మండల కేంద్రాలు, పట్టణాల్లో ఆ పార్టీ కేడర్‌ డోర్‌ టు డోర్‌ ప్రచారం చేస్తోంది. పార్టీ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించేం దుకు కారు గుర్తుకు ఓటేయాలని ప్రచారం చేస్తూ సభకు తరలిరావాలని మరోవైపు చెబుతున్నారు. ఈ సభ పై టీఆర్‌ఎస్‌ భారీగా ఆశలు పెట్టుకుంది. ప్రచారం జరుగుతున్న తీరుతో తమ విజయం ఖాయమని, కేసీఆర్‌ సభ సక్సెస్‌తో తమ బలం మరింత పెరుగుతుందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. సభలో నియోజకవర్గానికి సంబంధించి సీఎం ఇచ్చే హామీలు, ప్రసంగమే కీలకమని ఆ పార్టీ భావిస్తోంది.

ఇప్పటివరకు ఉన్నది ఒకటైతే ఈ సభ ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుందని, గెలుపు తమదేనని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సభ విజయవంతం చేసేందుకు ఏ మండలాల నుంచి ఎంత మందిని తరలించాలని పార్టీ ముఖ్య నేతలు.. మండల స్థాయి నేతలు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు సూచనలిచ్చారు. హుజూర్‌నగర్‌ పట్టణం నుంచి కూడా భారీగా జనసమీకరణ చేయనున్నట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. 

రేవంత్‌రెడ్డి రోడ్డు షో ఖరారు..
హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో ప్రచారానికి ఎంపీ రేవంత్‌రెడ్డి రోడ్డు షో షెడ్యూల్‌ ఖరారైంది. ఈ ఎన్నికల సందర్భంగా తొలసారి ఆయన నియోజకవర్గంలో ప్రచారానికి వస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఆయన రోడ్డు షో పెట్టారు. 18న ఉదయం 10గంటలకు పాలకీడు మండంల జానపహాడ్‌దర్గా, 11గంటలకు పాలకీడు, మధ్యాహ్నం ఒంటి గంటకు దిర్శించర్ల,  2గంటలకు నేరడుచర్ల, సాయంత్రం 4గంటలకు గరిడేపల్లి, సాయంత్రం 6గంటలకు హుజూర్‌నగర్‌ మండలం బూరుగడ్డ, రాత్రి 8గంటలకు వేపలసింగారంంలో రోడ్డు షో నిర్వహిస్తారు.

19న ఉదయం 8గంటలకు మఠంపల్లి, 10గంటలకు చింతలపాలెం మండలం మల్లారెడ్డిగూడెం, మధ్యాహ్నం 12 గంటలకు మేళ్లచెరువు, 1.30గంటలకు రోడ్డు షోతో హుజుర్‌నగర్‌ పట్టణానికి చేరుకోనున్నారు. ఇప్పటివరకు ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆ పార్టీ శాసన సభ పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క, పార్టీ ఎమ్యెల్యేలు, రాష్ట్రస్థాయి ముఖ్య నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. రేవంత్‌రెడ్డి ప్రచారంతో పార్టీ పరంగా మరింత ఊపు వస్తుందని నేతలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. రోడ్డు షో జరిగే ప్రాంతాల్లో జన సమీకరణపై ఆ పార్టీ దృష్టి పెట్టింది. రేవంత్‌రెడ్డితో పాటు ఉత్తమ్, పద్మావతి, ఇతర ముఖ్య నేతలు రోడ్డు షోలో పాల్గొననున్నారు. 

అన్ని పార్టీలు సుడిగాలి ప్రచారం..
ఎన్నికల ప్రచార గడువు సమీపిస్తుండడంతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌తో పాటు అన్ని పార్టీలు సుడిగాలి ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి విజయరామారావు, ఆ పార్టీ ముఖ్య నేతలు మంగళవారం నేరడుచర్ల, గరిడేపల్లి మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ నెల 18 లేదా 19న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ప్రచారానికి రానున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. టీడీపీ అభ్యర్థి తరఫున రాష్ట్ర నేతలు ప్రచారం చేస్తున్నారు.

సీపీఎం మద్దతు ఇచ్చిన అభ్యర్థి కోసం ఆ పార్టీకి బలమున్న గ్రామాల్లో ఉమ్మడి జిల్లా నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. టీఆర్‌ఎస్‌ కుల సంఘాల సమావేశాలను నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే దిశగా ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు ఒక్కో గ్రామంలో.. అక్కడి నేతలను కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు పల్లెలు, పట్టణాల్లో ఇంటింటి ప్రచారం చేస్తుండడంతో ఉప ఎన్నికల రాజకీయం మరింతగా వేడెక్కింది. పోలింగ్‌కు ఇక ఐదు రోజుల సమయమే ఉండడంతో అన్ని గ్రామాలు, పట్టణాల్లోని కాలనీలను టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు చుట్టివస్తున్నారు.    

మరిన్ని వార్తలు