గ్లోబల్‌ సిటీగా హైదరాబాద్‌ : కేసీఆర్‌

9 Feb, 2019 20:23 IST|Sakshi

హైదరాబాద్: నగరాన్ని గ్లోబల్‌సిటీగా మార్చేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించి, అమలు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. నగరాలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, అలాంటి సమస్యలను ముందుగానే అంచనా వేసి పరిష్కరించాలని ఉన్నతాధికారుల‌ను ఆదేశించారు. శనివారం ప్రగతిభవన్‌లో హైదరాబాద్ నగర అభివృద్ధిపై సీఎం సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కి) ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో భవిష్యత్తు అవసరాలకు తగినట్టు హైదరాబాద్ నగర మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని స్పష్టం చేశారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని రూపొందించే మాస్టర్ ప్లాన్ లో రాష్ట్ర మంత్రివర్గం మినహా మరెవరూ మార్పులు చేయకుండా చట్టం రూపొందిస్తామని వెల్లడించారు. హైదరాబాద్ నగర సమగ్రాభివృద్ధి ప్రణాళికను అమలు చేసే బాధ్యతను కేవలం హెచ్ఎండిఏ పై మాత్రమే పెట్టకుండా, వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులతో వివిధ ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. నగరాభివృద్ధికి జిహెచ్ఎంసి నిధులపైనే ఆధారపడకుండా ఇతరత్రా నిధులు కూడా సమకూరుస్తామని చెప్పారు.

అప్‌డేట్‌ కాకపోతే అంతే..
‘హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం పెద్ద ఎత్తున యువత వలస వస్తోంది. నగరంలోని వాతావరణం, సామరస్య పూర్వక జీవనం, మంచి పారిశ్రామిక విధానం ఫలితంగా పెద్ద ఎత్తున ఐటి కంపెనీలు, పరిశ్రమలు తరలి రావడంతో ఉద్యోగావకాశాలు పెరిగాయి. హోటల్, నిర్మాణ రంగంలో కూడా ఎంతో మందికి ఉపాధి దొరుకుతున్నది. ఈ కారణాల వల్ల ప్రతీ ఏటా ఐదారు లక్షల జనాభా హైదరాబాద్‌లో పెరుగుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా, దేశ నలుమూలల నుంచి హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడుతున్నారు. ఉద్యోగ, వ్యాపారాల రీత్యా నిత్యం హైదరాబాద్ నగరానికి వచ్చి పోయే వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతీ ఏటా రెండు కోట్లకు పైగా ప్రయాణికులు వచ్చిపోతున్నారు. ఇదంతా ఆర్థికాభివృద్దికి దోహదపడే అంశం. చాలా సంతోషకరమైన విషయం కూడా. కానీ, పెరుగుతున్న జనాభా, వారి అవసరాలకు తగినట్లు హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దకుంటే మాత్రం నగర జీవిత నరకప్రాయంగా మారక తప్పదు’ అని ముఖ్యమంత్రి హెచ్చరించారు.  నగర ప్రజలకు మంచినీరు అందించడానికి కేశవాపూర్ లో మంచినీటి రిజర్వాయర్‌ను ఈ నెలలోనే శంకుస్థాపన చేసి, శరవేగంగా పూర్తి చేయనున్నట్లు ఈ సందర్భంగా సీఎం  స్పష్టం చేశారు. మెట్రోరైలును శంషాబాద్‌ ఎయిర్ పోర్టు వరకు విస్తరిస్తామన్నారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఆస్కి అర్బన్ గవర్నెన్స్ విభాగాధిపతి వి.శ్రీనివాసాచారి, ఫ్యాకల్టీ మాలినీ రెడ్డి, సీఎంఓ కార్యదర్శులు స్మితా సబర్వాల్, మాణిక్ రాజ్, సందీప్ సుల్తానియా, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, ఎమ్మెల్యేలు డి.ఎస్. రెడ్యానాయక్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు