నేను చచ్చేలోపు రైతులు ధనవంతులు కావాలి: కేసీఆర్‌

26 Nov, 2018 14:12 IST|Sakshi

సాక్షి, డిచ్‌పల్లి : తాను చనిపోయేలోపు తెలంగాణ రైతులు ధనవంతులు కావాలని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. సోమవారం నిజమాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గాయ్‌ గాయ్‌ అరవడం తప్పా.. కాంగ్రెస్‌ పార్టీ చేసిందేమి లేదని విమర్శించారు. భూములు ఉన్నాయి కానీ, నీళ్లు లేవని, ఆరునూరైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి రైతుల కాళ్లు తడుపుతామన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరో వచ్చి ఎదో చెబుతారని, ఆగం కావద్దని ప్రజలకు సూచించారు.

ముస్లింలకు రిజర్వేషన్‌లు ఇవ్వమని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా అంటున్నారని, వచ్చేసారి ఆయన అధికారంలో ఉంటే కదా.. అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో 100 పైచిలుకు సీట్లు గెలుస్తున్నామని, అధికారంలోకి రాగానే రిజర్వేషన్లు సాధించుకుంటామన్నారు. ప్రజల కోసం పనిచేసే వాళ్లనే ఎన్నుకోవాలని, 55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌, టీడీపీలు ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో పోడు భూములకు పట్టాలతో పాటు రైతుబంధు వర్తింప జేస్తామన్నారు. నిజమాబాద్‌ రూరల్‌ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్‌ను లక్షమెజారిటీతో గెలిపించాలని కేసీఆర్‌ ప్రజలను కోరారు.

మరిన్ని వార్తలు