గజకర్ణ, గోకర్ణ కూటమిని తిప్పికొట్టండి

20 Nov, 2018 00:57 IST|Sakshi

ఖమ్మం, పాలకుర్తి బహిరంగ సభల్లో ప్రజలకు కేసీఆర్‌ పిలుపు

ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు దక్కకుండా చేయండి

టీఆర్‌ఎస్‌ను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించండి

‘సీతారామ’ను అడ్డుకునేందుకు కేంద్రానికి చంద్రబాబు 30 లేఖలు

ఖమ్మంలో అడుగు పెట్టాలంటే ఆయన క్షమాపణ చెప్పాలి

త్వరలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు

సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి, జనగామ : రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడి కుట్రలు పన్నుతున్నాయని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దుయ్యబట్టారు. అభివృద్ధికి సహకరించని కాంగ్రెస్‌కు.. ఇప్పుడు టీడీపీ తోడైందని, తెలంగాణలో నీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారంటూ విరుచుకుపడ్డారు. ముందస్తు ఎన్నికల మలివిడత ప్రచారంలో భాగంగా సోమవారం ఖమ్మం పట్టణం లోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో, జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ బహిరంగ సభల్లో కేసీఆర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరును ఆయన తూర్పారబట్టారు.

ఎన్నికల్లో గజకర్ణ, గోకర్ణ విద్యలను ప్రదర్శించడానికి కాంగ్రెస్, టీడీపీల కూటమి సిద్ధమవుతోందని, దాన్ని తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న, చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించిన కేసీఆర్‌... ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మళ్లీ పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఏర్పడగానే ఏడాదికి రూ. 5 వేల చొప్పున రైతు బంధు పథకం కింద అందిస్తామని, నిరుద్యోగులకు నెలకు రూ. 3,016 భృతి, వికలాంగుల పెన్షన్‌ రూ. 1,500 నుంచి రూ. 3,016కు, ఆసరా పెన్షన్‌ను రూ. 1,000 నుంచి రూ. 2,016కు పెంచుతామని హామీ ఇచ్చారు. ఖమ్మం సభకు తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌ అధ్యక్షత వహించగా మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, గనుల కార్పొరేషన్‌ చైర్మన్‌ సుభాష్‌రెడ్డి, పార్టీ జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పాలకుర్తి సభలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, గిరిజన సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్‌ గాంధీ నాయక్, ఆగ్రోస్‌ చైర్మన్‌ లింగంపల్లి కిషన్‌రావు, పార్టీ పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌రావు పాల్గొన్నారు. రెండు సభల్లో కేసీఆర్‌ చేసిన ప్రసంగాల్లోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... 

ఖమ్మం సభలో... 
‘సీతారామ’ను అడ్డుకునేందుకు బాబు 30 లేఖలు... 
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి 30 లేఖలు రాశారు. ఆయన జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాకే ఈ ప్రాంతంలో అడుగు పెట్టాలి. ఓట్ల కోసం జిల్లాకు వచ్చే చంద్రబాబును ప్రజలు నిలదీయాలి. తలాపునే గోదావరి ఉన్నా.. సాగునీటి కోసం ఖమ్మం జిల్లా ప్రజలు తండ్లాడాల్సిన దుస్థితికి గత పాలకులు కారణం కాదా? గోదావరి జలాలను వినియోగించుకునే హక్కు ఈ జిల్లా ప్రజలకు లేదా? సీతారామ ప్రాజెక్టు ద్వారా వినియోగించుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర జలవనరుల సంఘానికి 30 లేఖలు (లేఖ ప్రతులను సభావేదిక నుంచి ప్రజలకు పలుమార్లు చూపించారు) రాశారు. మన వేలితో.. మన కన్ను మనం పొడుచుకునేలా చేసే వ్యూహంలో.. మన తాడుతో మనమే ఉరి వేసుకునేలా చేసే విద్యలో చంద్రబాబు దిట్ట. ఈ ప్రమాదాన్ని జిల్లా ప్రజలు పసికట్టాలి. కాంగ్రెస్, టీడీపీ నేతలు హిమాలయాలకు వెళ్లి ఆకుపసరు తిన్నారా? ప్రభుత్వంలోకి రాగానే అద్భుతాలు సృష్టించడానికి. ప్రజలకు ఏం కావాలో తెలియని వారు.. వారి కోసం ఏం చేస్తారో చైతన్యవంతమైన ఖమ్మం జిల్లా ప్రజలు అర్థం చేసుకోవాలి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ మద్దతిచ్చే కూటమి గెలిస్తే జిల్లాలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టి ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే టీఆర్‌ఎస్‌ వైపు ఉంటారో.. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే టీడీపీకి ఓటు వేస్తారో ఖమ్మం జిల్లా ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. 

‘నామా’ను గెలిపిస్తే ప్రజలకు నామాలే... 
ఖమ్మం జిల్లాలో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వర్‌రావును గెలిపిస్తే ప్రజలకు నామాలు పెట్టడం ఖాయం. అలాగే సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వర్‌రావు గెలిస్తే జిల్లాలో సాగునీరు వద్దన్న చంద్రబాబుకే మద్దతు పలుకుతారు తప్ప.. తెలంగాణ ప్రజలపక్షాన నిలవరు. పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వడంలో విఫలమయ్యాని మమ్మల్ని విమర్శిస్తున్న కాంగ్రెస్, టీడీపీలు ఆ వర్గాల కోసం ఏం ఒరగబెట్టాయో చెప్పాలి. కాంగ్రెస్‌ హయాంలో ఇసుక సీనరేజీల ద్వారా కేవలం రూ.9.50 కోట్లు మాత్రమే ఆదాయం లభించింది. కానీ మా ప్రభుత్వ నాలుగున్నరేళ్ల పాలనలో రూ. 2,057 కోట్ల ఆదాయం వచ్చింది. 

భారీ మెజారిటీతో గెలిపించండి... 
గత ఎన్నికల వరకు పార్టీపరంగా ఖమ్మం మైనస్‌లో ఉండేది. ఇప్పుడు ప్లస్‌ ఖమ్మంగా పార్టీ బలపడింది. జిల్లాలో పది స్థానాలను గెలిచి తీరుతాం. రాష్ట్రంలో రైతుబంధు పథకానికి ఐక్యరాజ్యసమితి గుర్తింపు లభించింది. ఆ పథకం అమలవుతున్న తీరును ఐరాస ప్రశంసించి ప్రపంచ దేశాలకు ఈ విధానాన్ని వివరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆహ్వానించింది. ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత మా ప్రభుత్వానిదే. వాటిని నమ్మితే.. వాటి ఫలాలను పొందితే మీరు (ప్రజలు) మాకు ఓట్లు వేసి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించడమే కాక.. ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు దక్కకుండా చేయాలి. 

ప్రగల్భాలు పలకను... 
నేను ఢిల్లీలో చక్రం తిప్పుతానని, తోక తిప్పుతానని ప్రగల్భాలు పలకడం నాకు చేత కాదు. అయితే కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఒక కూటమిని తయారు చేయడం మాత్రం ఖాయం. త్వరలో ఈ పని మరింత వేగవంతం అవుతుంది. ప్రధాని మోదీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలించలేకపోతున్నారు. 

పాలకుర్తి సభలో... 
సాగుకు నిరంతర విద్యుత్‌ తెలంగాణలోనే... 

35 ఏళ్లు పాలించి ఏడిపించిన కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఏమీ ఆలోచించలేదు. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే కరెంటు పోతది. తెచ్చుకున్న రాష్ట్రంలో ఆదాయం ఎట్ల వస్తదో చూసి మేం సంపద పెంచినం. పెరిగిన సంపదను సంక్షేమం పేరుతో ప్రజలకు పంచినాం. ఎన్నికల్లో చెప్పని ఎన్నో హామీలను అమలు చేశాం. వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. అంగన్‌వాడీ వర్కర్లకు జీతాల పెంపు, ఆశావర్కర్లకు గౌరవ వేతనాల పెంపు, హోంగార్డులకు జీతాలు పెంచడం, ట్రాఫిక్‌ పోలీసులకు రిస్క్‌ అలవెన్సులు 30 శాతం ఇచ్చిన ఒకే రాష్ట్రం మనదే. ఇప్పుడు తెలంగాణ దేశంలోనే కాకుండా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. 

సొంత జాగా ఉంటే ‘డబుల్‌’మంజూరు... 
ప్రాణం పోయినా అబద్ధాలు చెప్పను. టీఆర్‌ఎస్‌ ప్రస్తుతం ఇస్తున్న ఒక్కో డబుల్‌ బెడ్రూం ఇల్లు గతంలో కాంగ్రెస్‌ ఇచ్చిన ఏడు ఇళ్లతో సమానం. గతంలో నిర్మించిన పాత ఇళ్లకు సంబంధించి రూ. 4 వేల కోట్ల రుణాలు మాఫీ చేశాం. ప్రస్తుతం వందకు వంద శాతం సబ్సిడీతో ఇళ్లు నిర్మిస్తున్నాం. పాలకుర్తి సోమేశ్వరుడి సాక్షిగా చెబుతున్నాం. గతంలో ఉన్న నిబంధనను సడలించి సొంత జాగా ఉన్న వాళ్లకు డబుల్‌ బెడ్రూం ఇళ్లను మంజూరు చేస్తాం. ఇళ్ల నిర్మాణాల్లో గతంలో రూ. 5 వేల కోట్ల అవినీతి జరిగింది. అప్పటి గృహనిర్మాణశాఖ మంత్రి, ప్రస్తుత పీసీసీ చీఫ్‌ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. 

జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు... 
రాష్ట్రంలో 43 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలివితో పాలన సాగించడంతో ఎన్నో విషయాల్లో ముందున్నాం. కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని నిజాయితీగా చేయడం వల్లే ఇది సాధ్యమైంది. మహిళా సంఘాలు, సెర్ప్‌ ఉద్యోగులు మంచిగా పని చేస్తున్నారు. ఐకేపీ మహిళలకు తర్ఫీదు ఇచ్చి అన్ని జిల్లాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లలో అవకాశం కల్పిస్తాం. అవసరాన్ని బట్టి వారి ఉద్యోగాలను పర్మినెంట్‌ చేస్తాం. 

వరంగల్‌కు 100 టీఎంసీల నీరిస్తాం... 
అడ్డం, పొడుగు చెప్పడం... ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్, టీడీపీల నైజం. ఎవరూ అడగకున్నా, ధర్నాలు చేయకున్నా కల్యాణ లక్ష్మి పథకం అందించాం. గజ్వేల్‌లో పుట్టిన ‘కంటి వెలుగు’ఆలోచనతో 80 లక్షల మందికి ప్రయోజనం కలిగింది. కరెంటు తెచ్చినం.. ఇక పోనివ్వం. కాళేశ్వరం, పాలమూరు, దేవాదులతో వరంగల్‌కు 100 టీఎంసీల నీటిని ఇస్తాం. పాలకుర్తి నుంచి దయాకర్‌రావును భారీ మెజారిటీతో గెలిపించాలి.   

మరిన్ని వార్తలు