50 రోజుల ప్రచారం! 

26 Oct, 2018 02:10 IST|Sakshi

60 సెగ్మెంట్లలో ఏకపక్షంగా దూసుకెళ్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు 

మరో 50 సెగ్మెంట్లలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల పోటీ ప్రచారం 

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించి నేటికి 50 రోజులు 

మరో 40 రోజులు ప్రచారం చేయాల్సిన పరిస్థితి 

ప్రచార నిర్వహణపై కేసీఆర్‌ వ్యూహాత్మక వైఖరి 

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ ముందుంటోంది. ప్రత్యర్థి పార్టీలతో పోల్చితే దాదాపు 60 సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారం ఏకపక్షంగా సాగుతోంది. 50 రోజులుగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ రద్దయిన సెప్టెంబర్‌ 6న టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజు నుంచే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. అప్పటి నుంచి నియోజకవర్గస్థాయి, మండల స్థాయి సభలు నిర్వహించారు. గ్రామాల వారీగా ఇంటింటి ప్రచారం సైతం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా 50 రోజుల ప్రచారం పూర్తి చేశారు. డిసెంబర్‌ 7న పోలింగ్‌ జరగనుంది. దీనికి రెండు రోజుల ముందు వరకు ప్రచారం కొనసాగనుంది. అంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మరో 40 రోజుల పాటు ప్రచారం చేయనున్నారు. సుదీర్ఘ ప్రచారంతో ఆర్థికంగా భారమవుతున్నా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు రెండు మూడు సార్లు గ్రామాల వారీగా ఓటర్లను కలిసే అవకాశం వచ్చింది. క్షేత్రస్థాయిలో ఉండే పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు వెసులుబాటు దక్కుతోంది. 

మహాకూటమిలో చిక్కులు.. 
గతంలో కంటే భిన్నంగా ఈసారి కాంగ్రెస్‌ ఆశావాహుల పరిస్థితి భిన్నంగా ఉంది. టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లతో కలసి ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. కాంగ్రెస్‌ తాజా మాజీ ఎమ్మెల్యేలు, పలువురు ముఖ్యనేతల సెగ్మెంట్లలో ప్రచారం జరుగుతోంది. ఇలాంటివి రాష్ట్రంలో 50 స్థానాలు ఉన్నాయి. ఈ సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు పోటీగా కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. పొత్తులతో ఏ సీటు ఏ పార్టీకి దక్కుతుందో, సొంత పార్టీలోనూ టికెట్‌ ఎవరికి వస్తుందో తెలియక మిగిలిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ తరఫున ప్రచారం సాగట్లేదు. దీంతో ఈ సెగ్మెంట్లలో ప్రచారం పరంగా టీఆర్‌ఎస్‌కు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. మహాకూటమి అభ్యర్థుల ఖరారుతో ఇక్కడి పరిస్థితులు మారనున్నాయి. 

ప్రచార సరళిపై సమీక్ష.. 
టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచార సరళిపై సీఎం కేసీఆర్‌ గురువారం సమీక్షించారు. ఉమ్మడి జిల్లాల వారీగా అభ్యర్థుల ప్రచార తీరుపై నివేదికలను పరిశీలించారు. ఏ సెగ్మెంట్లలో ఎలాంటి స్పందన ఉందనే విషయాన్ని సర్వేలతో తెప్పించుకున్నారు. అన్నింటినీ పరిశీలించి పలువురు అభ్యర్థులతో ఫోన్‌లో మాట్లాడారు. వరంగల్‌లో నిర్వహించే బహిరంగసభ నిర్వహణ రోజున ఆ ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థులతో ప్రత్యేకంగా చర్చించి ఎన్నికల వ్యూహాలపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. అనంతరం ఖమ్మం, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల్లోనూ ఇదే వ్యూహం అమలు చేయనున్నారు.

గులాబీ బాస్‌ వ్యూహాలు
రాష్ట్రంలో మళ్లీ అధికారం లక్ష్యంగా ముందస్తు ఎన్నికలకు సన్నద్ధమైన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రచార నిర్వహణలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి నుంచే నియోజకవర్గాల స్థాయిలో ప్రచారం మొదలుపెడితే ఆ ఊపును ఎక్కువ రోజులు కొనసాగించడం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఉన్నట్లుగా కనిపిస్తోంది. మహాకూటమిలో సీట్ల వ్యవహారం కొలిక్కి వచ్చి అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే నియోజకవర్గాల స్థాయిలో ప్రచారం పెంచాలని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సెప్టెంబరు 7న హుస్నాబాద్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అనంతరం నిజామాబాద్, నల్లగొండ, వనపర్తిలో భారీ బహిరంగసభలు నిర్వహించారు. 

త్వరలో 12 స్థానాలకు ఖరారు
టీఆర్‌ఎస్‌ ఇప్పటి వరకు 107 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వారం కింద ప్రకటించిన మలక్‌పేట, జహీరాబాద్‌ అభ్యర్థులు సైతం ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. పెండింగ్‌లో పెట్టిన 12 అసెంబ్లీ స్థానాలకు సీఎం కేసీఆర్‌ అభ్యర్థులను ఖరారు చేశారు. వరంగల్‌ బహిరంగసభకు ముందు వరంగల్‌ తూర్పు, కరీంనగర్‌ బహిరంగసభకు ముందు చొప్పదండి సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిసింది. ఖైరతాబాద్, అంబర్‌పేట, గోషామహల్, చార్మినార్, అంబర్‌పేట, ముషీరాబాద్, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, హుజూర్‌నగర్, కోదాడ సీట్లను మాత్రం మహాకూటమి అభ్యర్థులపై స్పష్టత వచ్చాకే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పలువురు ఆశావహులకు మాత్రం ప్రచారం చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది.  

మరిన్ని వార్తలు