ఏపీ ప్రత్యేక హోదాకు టీఆర్‌ఎస్‌ సహకరిస్తుంది: కేసీఆర్‌

8 Apr, 2019 19:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలపై కేసీఆర్ ఘాటుగా స్పదించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో కేసీఆర్ మద్దతునిస్తా అని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి చెవిలో చెప్పారా? అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలపై కేసీఆర్ స్పందించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. 

ఏపీ ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలడంతో చంద్రబాబునాయుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఏపీ ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో టీఆర్ఎస్ వైఖరి స్పష్టంగా ఉందని కేసీఆర్ చెప్పారు. గతంలో పార్లమెంట్ లోనూ స్పష్టంగా చెప్పామని, ఇప్పుడూ చెబుతున్నామని ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మా పార్టీ నాయకుడు కేశవరావు రాజ్యసభలోనే స్పష్టంగా చెప్పారని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల్లో 16 టీఆర్ఎస్, ఒక స్థానంలో ఎంఐఎం గెలుపుఖాయమని, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి టీఆర్ఎస్ విధానపరంగా మద్దతునిస్తుందని, సహకరిస్తుందని స్పష్టం చేశారు. అందుకు సంబంధించి తన వద్ద లేటెస్ట్ సర్వే వివరాలు కూడా ఉన్నాయని చెబుతూ తాము ప్రత్యేక హోదా కోసం కేంద్రంలో ప్రయత్నిస్తామన్నారు. 

అలాగే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలోనూ కేసీఆర్ తమ అభిప్రాయాన్ని విడమరిచి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తమ పార్టీ అడ్డుపడటంలేదని స్పష్టం చేశారు. మా మేలు కోరుకుంటూ ఇతరుల మేలు కోరుకుంటామని, చెవుల్లో చెప్పుకుని చీకటి పనులు చేస్తూ కుట్రలు చేసే అలవాటు తమకు లేదని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు కట్టుకోమని చెప్పాం. మా వాటా మాకు కావాలన్నామే తప్ప పోలవరం కట్టొద్దని ఎప్పుడూ చెప్పలేదని, ఎన్నో టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలవుతున్నాయని, పోలవరం కట్టుకోవాలనే తాము కోరుతున్నామని కుండబద్ధలు కొట్టారు. ఈ ఏడాది కూడా 2600 టీఎంసీల నీరు వృథాగా పోయిందని తెలిపారు. ఇకపోతే చంద్రబాబులాంటి కొందరు కిరికిరీ పెట్టే వాళ్లు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి తమకు ఎలాంటి పంచాయితీ లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచివారన్నారు. 

చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ కూడా ఏపీ ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ అనేక సందర్భాల్లో ప్రత్యేక హోదా అంశం లేవనెత్తారు. ప్రత్యేక హోదాకు మద్దతునిస్తారని జగన్ కు కేసీఆర్ చెవిలో చెప్పారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాటన్నింటికీ సమాధానంగా కేసీఆర్ ఆ విషయంపై మరోసారి తమ వైఖరిని స్పష్టం చేశారు. పైగా తెరవెనుక లాలూచీ వ్యవహారాలు, చెవుల్లో చెప్పుకోవడాలు, కుట్రలు పన్నడాలు తమకు రావంటూ చంద్రబాబు, పవన్ తీరుపై విరుచుకుపడ్డారు.

మరిన్ని వార్తలు