సీఎంగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం

13 Dec, 2018 13:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు రెండోసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్‌తో పాటు మహమూద్‌ అలీ మంత్రిగా  పదవీ స్వీకార ప్రమాణం చేశారు. గురువారం మధ్యాహ్నం 1:25 నిమిషాలకు రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ వారితో ప్రమాణం చేయించారు. ‘కేసీఆర్‌ అను నేను’ అంటూ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతానికి కేసీఆర్‌, మహమూద్‌ అలీలు మాత్రమే ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ పార్టీ  నాయకులతో పాటు వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. తొలుత కేసీఆర్‌ ఒక్కరే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ప‍్రచారం జరిగినప్పటికీ, మహమూద్‌ అలీ కూడా మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. జిల్లాలు, సామాజిక వర్గాల కూర్పు అనంతరం ఈ నెల 18న పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరనుందని సమాచారం. 

తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ 2014 జూన్‌ 2న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా గవర్నర్‌ నరసింహనే కేసీఆర్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా, అప్పుడు ఆయనతో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అనంతరం మంత్రి వర్గాన్ని విస్తరించారు. ఈసారి మాత్రం కేసీఆర్‌తో పాటు మహమూద్‌ అలీ ఒక్కరే మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయడం విశేషం.

బుధవారం కొత్తగా ఎన్నికైన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సమావేశం తెలంగాణభవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ శాసనసభపక్ష నేతగా కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్‌ను ఎన్నుకునే తీర్మానాన్ని ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత ప్రవేశపెట్టగా, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ బలపరిచారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు