ఓడితే వేటు తప్పదు

5 Jan, 2020 02:08 IST|Sakshi

ఏ మున్సిపాలిటీలో ఓడినా మంత్రులు బాధ్యత వహించాల్సిందే: కేసీఆర్‌ హెచ్చరిక

ఏకపక్ష విజయం సాధించాలని స్పష్టీకరణ

మైనస్‌ మార్కులు పడితే మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు... ఎమ్మెల్యేలు కేంద్రంగానే నిర్ణయాలు, వారి చేతికే బీ ఫారాలు

సర్వేలు అనుకూలంగా ఉంటేనే అభ్యర్థుల ఎంపిక... ఎక్కడా బీజేపీ ప్రభావం లేదు.. కాంగ్రెస్‌ నేతలు సన్నాసులు

ప్రభుత్వ పథకాలే ఎజెండా

టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్య నేతలకు దిశానిర్దేశం  

సాక్షి, హైదరాబాద్‌ : ‘ఏ మున్సిపాలిటీ ఓడిపోయినా మంత్రులుగా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎక్కడైనా దెబ్బతింటే మీ ఖాతాలో మైనస్‌ మార్కులు పడటంతోపాటు మీపై ప్రభావం ఉంటుంది. మిమ్మల్ని మీరు కాపాడుకోవడంలో దెబ్బతింటారు’అని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర మంత్రులను హెచ్చరించారు. మున్సిపల్‌ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో శనివారం జరిగిన టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో సుమారు గంటన్నరపాటు ప్రసంగించిన కేసీఆర్‌... మున్సిపల్‌ ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించాల్సిన తీరుపై ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం రెండు రోజుల క్రితం మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ మున్సిపల్‌ ఎన్నికల సన్నాహ క సభలో మంత్రి మల్లారెడ్డి, మాజీ మంత్రి మలిపెద్ది సుధీర్‌రెడ్డి నడుమ చోటుచేసుకున్న ఘటనను కేసీఆర్‌ పరోక్షంగా ప్రస్తావించారు. ‘మల్లారెడ్డి గారూ.. మీ పరిధిలో పది మున్సిపాలిటీలు ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడైనా ఇబ్బంది అయితే మీ స్థానానికి ఇబ్బంది ఏర్పడుతుంది’అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే... 

ఎమ్మెల్యేలు కేంద్రంగానే నిర్ణయాలు..
ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా గతంలో నిర్ణయాలు తీసుకున్న కొన్ని పార్టీలు ఇబ్బంది పడటంతోపాటు కనుమరుగయ్యాయి. అందుకే మన పార్టీలో ఎమ్మెల్యేలు కేంద్రంగా, ఎమ్మెల్యేల ద్వారానే నిర్ణయాలు జరుగుతాయి. అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపు బాధ్యత సంబంధిత నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలపైనే ఉంటుంది. బీ–ఫారం జారీ, అసమ్మతుల బుజ్జగింపు, ప్రచారం తదితరాలన్నీ ఎమ్మెల్యేల భుజస్కంధాలపైనే పెడుతున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో మీ విజయం కోసం పనిచేసిన తరహాలోనే మున్సిపల్‌ ఎన్నికల్లోనూ గెలుపు లక్ష్యంగా పనిచేయాలి. సాధ్యమైనంత మేర పార్టీ కేడర్, నేతలను ఎమ్మెల్యేలు కలుపుకొని పోవాలి. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన బీ–ఫారాలు, ప్రచార సామగ్రి తదితరాలు ఎమ్మెల్యేలకు అప్పగిస్తాం. క్షేత్రస్థాయిలో అందరూ కలసికట్టుగా సమన్వయంతో పనిచేసి అన్నిచోట్లా గెలుపొందాలి. ఎక్కడైనా సమస్యలుంటే జిల్లా మంత్రులు సమన్వయం చేయాలి. 

శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో ప్రసంగిస్తున్న కేసీఆర్‌. చిత్రంలో వేముల ప్రశాంత్‌రెడ్డి, హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్, మాలోతు కవిత, సబితా ఇం్రద్రారెడ్డి , పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్, కేటీఆర్, కేకే, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, నిరంజన్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సీహెచ్‌ మల్లారెడ్డి, ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, బి. వినోద్‌కుమార్‌ తదితరులు 

సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక... 
మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉంటాయని అన్ని సర్వేలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల తరహాలో అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మనమే విజయం సాధిస్తాం. అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొని ప్రతి సందర్భంలోనూ సర్వేల ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. ఉదాహరణకు గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో మన అభ్యర్థికి స్థానిక పరిస్థితి అనుకూలంగా లేదని సర్వేలు వెల్లడించాయి. మంత్రి హరీశ్‌రావు చెప్పడంతో పాత అభ్యర్థికే టికెట్‌ ఇచ్చాం. సిద్దిపేటలో తనకు విజయం నల్లేరు మీద నడక కావడంతో సంగారెడ్డిపై ఎక్కువ దృష్టిపెట్టి హరీశ్‌ కష్టపడినా కొద్ది తేడాతో ఓటమి చెందాం. ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికల్లో క్షేత్రస్థాయి పరిస్థితిపై ఇప్పటికే చాలా సర్వేలు చేశాం. సర్వే ఫలితాలు అనుకూలంగా ఉన్న వారినే అభ్యర్థులుగా ఎంపిక చేసి బీ–ఫారాలు ఇవ్వండి. పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థులు ఎన్నికల తర్వాత పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి వెన్నుపోటు పొడిస్తే కఠిన చర్యలు ఉంటాయి. 

బీజేపీ ప్రభావం లేదు.. కాంగ్రెస్‌ నేతలు సన్నాసులు 
ప్రస్తుత ఎన్నికల్లో మనకు ప్రతిపక్షాల నుంచి పెద్దగా పోటీ లేదు. టీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయం అనే ప్రచారాన్ని తిప్పికొట్టాలి. ఆ పార్టీ ప్రభావం పెద్దగా ఉండదు. ఎంత మంది అమిత్‌ షాలు వచ్చినా మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు. కాంగ్రెస్‌ పార్టీలో అందరూ సన్నాసులే ఉన్నందున ఆ పార్టీతో పెద్దగా పోటీ ఉండదు. ఒక్కో నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రచార బాధ్యతలు చూసుకోవాలి. నేను, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎన్నికల ప్రచారానికి వచ్చే అవకాశం లేదు. అవసరమైన చోట జిల్లాకు చెందిన మంత్రులను ప్రచారానికి పిలవండి. ఇవి ఆర్భాటం చేసే ఎన్నికలు కావు. క్షేత్రస్థాయిలో కులాలు, మతాలు తదితర సమీకరణాలు అనేకం పనిచేస్తాయి కాబట్టి కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఆర్‌ఎంపీలు, మహిళా సంఘాలు తదితర క్షేత్రస్థాయిలో ప్రభావం చూపే వర్గాలతో భేటీ కావడం ద్వారా ఫలితం ఉంటుంది. పార్టీకి 60 లక్షలకుపైగా సభ్యత్వం ఉంది. తొలుత పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తూ వారితో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయాలి.
 
ప్రభుత్వ పథకాలే ప్రచార ఎజెండా... 
ప్రచారంలో భాగంగా ఆయా వార్డుల పరిధిలోని ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో జరిగే భేటీలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను గడపగడపకూ తీసుకెళ్లండి. గత ఆరేళ్లలో టీఆర్‌ఎస్‌కు ప్రజల్లో ఆదరణ లభించింది. టీఆర్‌ఎస్‌ పథకాల వల్ల తెలంగాణకు దేశంలోనే అగ్రస్థానం దక్కింది. సంక్షేమ పథకాలే ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లాలి. టీఆర్‌ఎస్‌ నేతలంతా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా పనిచేయాలి. ఎన్నికల తర్వాత కొత్త రెవెన్యూ చట్టం, పల్లె, పట్టణ ప్రగతికి సంబంధించిన అనేక కార్యక్రమాలు ఉంటాయి. రైతు సమన్వయ సమితులను బలోపేతం చేయడం ద్వారా రైతాంగాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. పౌరసత్వ చట్టంతోపాటు ఇతర అంశాల్లో మనం మొదటి నుంచి ఒకే రకమైన వైఖరితో ఉన్నాం. మనది కులాలు, మతాలకు అతీతమైన సెక్యులర్‌ పార్టీ.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు