హాత్‌.. ఆప్‌ కే సాత్‌

12 Nov, 2018 03:14 IST|Sakshi

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మైనారిటీ సబ్‌ప్లాన్‌

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వేస్తే మైనారిటీ సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేకం గా మైనారిటీ సబ్‌ప్లాన్‌ అమలు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పునరుద్ఘాటించారు. జనాభా దామాషా ప్రకారం రాష్ట్ర బడ్జెట్‌లో 12 శాతం నిధులు కేటాయిస్తామని హామీనిచ్చారు. ముస్లిం పర్సనల్‌ లా బోర్డు వ్యవహారంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. ముస్లిం మనోభావాలకు విరుద్ధంగా ట్రిపుల్‌ తలాక్‌ వ్యవహారంలో బీజేపీకి టీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు.

బీజేపీకి అన్ని విధాలుగా సహకరిస్తున్న టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయాలని మజ్లిస్‌ పార్టీ అడగటం ముస్లిం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో జరిగిన మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ జయంతి వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ముస్లింలకు 12 శాతం రిజ ర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్‌ మోసం చేశారని ఆరోపించారు. రిజర్వేషన్ల కోసం అవసరమైతే ఢిల్లీని కదిలిస్తానని, భూకంపం సృష్టిస్తానని చెప్పి ఇప్పుడు నోరు విప్పడం లేదని విమర్శించారు.

ఆక్రమణకు గురైన వక్ఫ్‌బోర్డు భూములను స్వాధీనం చేసుకుం టామని, న్యాయపరమైన అధికారాలు కల్పిస్తామని ప్రకటించిన కేసీఆర్‌ ఇంచ్‌ భూమి కూడా వెనక్కి తీసుకోలేదన్నారు. దేశాన్ని బడా మోదీ, రాష్ట్రాన్ని చిన్న మోదీ భ్రష్టు పట్టిస్తున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను, కేంద్రంలో బీజేపీని ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

ఒవైసీకి ఎందుకు అర్థం కావడంలేదు: కన్హయ్య
బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య గల ఒప్పందం అందరికీ అర్థమవుతున్నా మజ్లిస్‌పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీకి ఎందుకు అర్థం కావడం లేదని జేఎన్‌యూ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ సూటిగా ప్రశ్నించారు. బీజేపీకి అడుగడుగునా అన్ని రకాలుగా టీఆర్‌ఎస్‌ సహకరిస్తోందన్నారు. ముస్లింల గొంతుకగా చెప్పుకునే మజ్లిస్‌ పార్టీ టీఆర్‌ఎస్‌తో కలసి ఎలా వెళ్తుందని ప్రశ్నించారు. దేశం ప్రమాదంలో పడిందని, చరిత్ర ను వక్రీకరించే యత్నం జరుగుతోందన్నారు.

తెలం గాణలో మహా కూటమి విజయం సాధించి దేశానికి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. రోహిత్‌ వేముల ఆత్మహత్యకు కారణమైన దోషులకు శిక్ష పడాలన్నా రు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మైనారిటీ సెల్‌ చైర్మన్‌ నదీమ్‌ జావీద్, ఏఐసీసీ కార్యదర్శులు మధుయాష్కి, సలీం, బోసు రాజు, రాజీవ్‌ శుక్లా, పార్లమెంట్‌ సభ్యుడు డాక్టర్‌ నాసిర్, రాష్ట్ర మైనారిటీ సెల్‌ చైర్మన్‌ సయ్యద్‌ సోహెల్‌ ఖాద్రీ, నేతలు సాజిద్‌ ఖాన్, నిజామొద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు