చెన్నైకి సీఎం కేసీఆర్‌

13 May, 2019 01:26 IST|Sakshi

నేడు డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ

తిరుచ్చి, శ్రీరంగం ఆలయాల సందర్శన

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తమిళనాడు పర్యటనకు వెళ్లారు. ఆదివారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి చెన్నై చేరుకున్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలకపాత్ర పోషించాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగానే ఆయన తమిళనాడుకు వెళ్లారు. డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్‌తో కేసీఆర్‌ సోమవారం సాయంత్రం సమావేశమవుతారు. కేసీఆర్‌ ఇటీవలే కుటుంబ సమేతంగా కేరళ, తమిళనాడు      పర్యటనకు వెళ్లి శుక్రవారం రాత్రే వచ్చారు. కేరళ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో భేటీ అయి ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చించారు. తాజాగా డీఎంకే అధినేతతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేసీఆర్‌ కుటుంబ సమేతంగా శ్రీరంగం, తిరుచ్చి ఆలయాలను సందర్శించనున్నారు. సోమవారం చెన్నైలోనే పాండిచ్చేరిలోనూ పర్యటించే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి.  

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటే లక్ష్యంగా...
జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌కు శ్రీకారం చుట్టారు. దేశంలో సమాఖ్య వ్యవస్థ బలోపేతమయ్యేందుకు ప్రాంతీయ పార్టీలు కలసి కూటమిగా ఉండాలని భావిస్తున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ బలోపేతం కోసం గతంలో టీఎంసీ అధినేత మమతా బెనర్జీ, బీజేడీ అధినేత నవీన్‌పట్నాయక్, జేడీఎస్‌ అధినేత దేవేగౌడను కలసి చర్చించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు దగ్గరపడుతుండటంతో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు మరోదశ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఫెడరల్‌ ఫ్రంట్‌తో వామపక్షాలు కలసి రావాలని కేరళ సీఎం పినరయి విజయన్‌ను కోరారు. తమిళనాడులో ప్రధాన రాజకీయ పార్టీ డీఎంకే అధినేత స్టాలిన్‌తోనూ ఈ అంశంపై చర్చించేందుకు వెళ్లారు. త్వరలోనే సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్‌ పార్టీ అధినేతలతోనూ ఫెడరల్‌ ఫ్రంట్‌పై కేసీఆర్‌ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు