తమిళనాట కేసీఆర్‌ యువసేన

9 Apr, 2018 09:17 IST|Sakshi
సమావేశంలో ప్రసంగిస్తున్న కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి

టీ.నగర్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మద్దతు తెలుపుతూ తమిళనాట ‘తమిళనాడు కేసీఆర్‌ యువసేన’ పేరుతో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన కొందరు యువకులు ఏర్పాటుచేశారు. యువసేన ప్రారంభోత్సవం చెన్నై ఓఎంఆర్‌రోడ్డులోని ఎస్‌వీవీ కల్యాణ మండపంలో ఆదివారం జరిగింది. యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ చెరుకుపల్లి సతీష్‌ సభకు అధ్యక్షత వహించారు. ఈ ప్రారంభోత్సవానికి  తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు శ్రీ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితులను సరిదిద్దే నాయకుడు లేదని, దేశానికి నాయకత్వ లేమి ఉందని అన్నారు. దక్షిణాది నుంచి ఒక విప్లవ నాయకిగా పేరొందిన జయలలిత మరణం తరువాత కేంద్రం దక్షిణాది రాజకీయ పార్టీలను తమ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేసిందన్నారు.

ఈ తరుణంలో ఒక వెలుగు కిరణంలా నేనున్నానని చెప్పడమే కాకుండా తమిళనాడు ప్రజలు పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా రాష్ట్రంలో ఉన్న 39 పార్లమెంటు స్థానాల్లో 37 స్థానాల్లో ఆమె నాయకత్వంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీకి విజయాన్ని ప్రసాదించారని తెలిపారు. అదే విధంగా తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశం అనుకున్నంతగా అభివృద్ధి సాధించలేదని, బీజేపీ కాంగ్రెస్‌ వారి పాలనతో జరిగిన అభివృద్ధి శూన్యమని, దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలంటే ఒక గుణాత్మకమైన మార్పు కావాలన్న సంకేతంతో కేంద్రాన్ని ఎదిరించారని, జయలలిత బాటలో కేంద్రంపై నిప్పులు చెరిగారన్నారు.

రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల కోసం దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో కలసి ఒక ఫెడరల్‌ ఫ్రంట్‌ (మూడవ ఫ్రంట్‌) దిశగా అడుగులు వేస్తున్న కేసీఆర్‌ విజయం సాధించడం ఖాయమని ఈ దేశానికి తెలుగువాడి సత్తాను, దిల్‌ను కేసీఆర్‌ చాటాలని మేమందరం కోరుకుంటున్నామన్నారు. తెలుగు వారు చెన్నై నగర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నప్పటికీ, ఇక్కడి ప్రభుత్వాలు తెలుగువారిని దిగువ శ్రేణి వారిగా చూడడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున తెలుగువారి సమస్యలన్నింటినీ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తీరని డిమాండ్లు తీర్చేందుకు చర్యలు చేపట్టాలని కేసీఆర్‌ను కోరారు. తొలుతగా కేతిరెడ్డి దీపావిష్కరణ చేసి సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి కె.రామకృష్ణ, శ్రీనివాసులు రెడ్డి, కృష్ణతేజ, భరత్‌రెడ్డి, కల్యాణ్‌రెడ్డి,  తెలుగువారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు