మౌనం దాల్చిన ముఖ్యమంత్రి!

21 Feb, 2018 11:33 IST|Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) అన్షు ప్రకాశ్‌పై ఆప్ ఎమ్మెల్యేల దాడి ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్న నేపథ్యంలో ఈ అంశంపై స్పందించేందుకు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నిరాకరించారు. ఈ విషయమై విలేకరులు ఆయనను ప్రశ్నించడానికి ప్రయత్నించినప్పటికీ.. ఆయన మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. మరోవైపు ఈ దాడి కేసులో ఆప్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ జర్వాల్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడంపై ఆ పార్టీ మండిపడుతోంది. దీని వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపిస్తోంది.

సోమవారం రాత్రి తనపై ఆప్‌ ఎమ్మెల్యేలు దాడి చేశారని సీఎస్‌ అన్షు ప్రకాశ్‌ ఢిల్లీ ఉత్తర డీసీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ‘సోమవారం రాత్రి 8.45 గంటలకు సీఎం సలహాదారు నాకు ఫోన్‌ చేసి అర్ధరాత్రి సీఎం నివాసంలో సమావేశానికి హాజరుకావాలని చెప్పారు. ఆప్‌ ప్రభుత్వ మూడేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా కొన్ని ప్రచార కార్యక్రమాలు, ప్రకటనల గురించి మాట్లాడేందుకు ఆ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. నేను సీఎం నివాసానికి వెళ్లేటప్పటికి అక్కడ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాతోపాటు మరో 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. నేను వెళ్లాక తలుపులు మూసి నన్ను ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, మరో ఎమ్మెల్యే మధ్య కూర్చోబెట్టారు. ప్రచార ప్రకటనల విడుదలకు సంబంధించి ఎమ్మెల్యేల ప్రశ్నలకు సమాధానాలివ్వాల్సిందిగా సీఎం నన్ను ఆదేశించారు. నేను నిరాకరించడంతో నన్ను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని ఎమ్మెల్యేలు బెదిరించారు.

నాకు ఇరువైపులా కూర్చున్న ఎమ్మెల్యేలు అకారణంగా నా తలపై కొట్టారు. నా కళ్లద్దాలు కూడా కింద పడిపోయాయి. నేను ఎలాగోలా అక్కడ నుంచి బయటపడగలిగాను’ అని సీఎస్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో అక్కడున్న అందరూ ముందుగానే కుట్ర పన్ని, పక్కా ప్రణాళికతో తనపై దాడి చేశారనీ, వారందరిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. తర్వాత లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను కలసి ఈ విషయం ఆయనకు చెప్పానన్నారు. అయితే, ఈ ఆరోపణలను ఢిల్లీ సీఎం కార్యాలయం, ఆప్‌ ఖండించింది. తమ ప్రభుత్వంపై నిరాధారమైన, విపరీత నిందలు వేస్తున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీలో రేషన్‌ సరుకులు సరిగ్గా అందడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో దానిపై మాట్లాడేందుకే సీఎస్‌ను పిలిచామంది. ప్రచార కార్యక్రమాల గురించి మాట్లాడేందుకు ఆయనను పిలిచామనడం అబద్ధమని ఆప్‌ అంటోంది.

మరిన్ని వార్తలు