కేజ్రీవాల్‌కు గట్టిపోటీ ఇవ్వనున్న అభ్యర్థులు..!

22 Jan, 2020 20:04 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకర్గంలో పోటీ రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో 93 మంది అభ్యర్థులు నామినేషన్ వేసినట్లు తెలుస్తోంది. ఇదే స్థానం నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బరిలో నిలవడం.. భారీ సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేయడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. అయితే నామినేషన్ల ఉపసంహరణ పూర్తయినా తరువాత ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉంటారో  తేలనుంది. చదవండి: 6 గంటలు కేజ్రీ వెయిటింగ్‌

మరోవైపు నామినేషన్‌ దాఖలు చేసిన  93 మంది అభ్యర్థుల్లో పదిమంది ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్  కార్పొరేషన్(డీటీసీ) మాజీ కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. అలాగే ఐదుగురు క్యాబ్‌ డ్రైవర్లు కూడా నామినేషన్‌ వేశారు. 2011లో  భారత అవినీతి నిరోధక ఉద్యమంలో పాల్గొన్న నలుగురు సామాజిక కార్యకర్తలు కూడా నామినేషన్లు వేసినట్లు తెలుస్తోంది. వీరితోపాటు ‘చక్‌ దే ఇండియా’ సినిమాలో అతిథిపాత్ర పోషించిన జాతీయ హాకీ క్రీడాకారుడు కూడా ఢిల్లీ బరిలో నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే వీరంతా కూడా కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగానే బరిలో నిలిచామని చెబుతున్నారు. డీటీసీ కాంట్రాక్టు ఉద్యోగుల బృందంలోని మనోజ్‌ శర్మ మాట్లాడతూ.. కాంట్రాక్టు కార్మికులందరికీ సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేసినందుకు తమను కేజ్రీవాల్‌ విధుల్లో నుంచి తొలగించారని తెలిపారు. రాజకీయ రంగంలో కేజ్రీవాల్‌ను ఓడించడానికి ఇదే తమకు వచ్చిన ఏకైక అవకాశం అని ఆయన పేర్కొన్నారు. చదవండి: అయ్యో కేజ్రీవాల్‌.. ఆలస్యమైందా!

ట్యాక్సీ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపలేదని నామినేషన్‌ దాఖలు చేసిన ఓ డ్రైవర్‌ తెలిపారు. ఆటోరిక్షా ఛార్జీలు సవరించబడ్డాయి కానీ, టాక్సీ డ్రైవర్లను ఆదుకోవడానికి కేజ్రీవాల్‌ ఎటువంటి పథకం తీసుకురాలేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఆప్‌ నేతలు మాత్రం ఇదంతా బీజేపీ కుట్రేనని ఆరోపిస్తున్నారు. బలపరిచేందుకు కనీసం 10 మంది కూడా లేని వారితో కావాలనే నామినేషన్లు వేయించిందని ఆప్‌నేతలు ఆరోపిస్తున్నారు. చదవండి: ఆప్‌ అభ్యర్థులను ప్రకటించిన కేజ్రీవాల్‌

కాగా, మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు కేజ్రీవాల్‌ నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. తాము  నామినేషన్‌ పత్రాలు ఇచ్చేదాకా ఆయన్ను వెళ్లనిచ్చేది లేదని అప్పటికే భారీ సంఖ్యలో  అక్కడున్న అభ్యర్థులు పట్టుబట్టిన విషయం తెలిసిందే. దీంతో నిబంధనల ప్రకారం కేజ్రీవాల్‌ టోకెన్‌ తీసుకున్నారు. ఆయన టోకెన్‌ నంబర్‌  45 వచ్చేసరికి ఆయన వేచిఉండాల్సి వచ్చింది.

మరిన్ని వార్తలు