గాడ్సే ఫాలోవర్స్‌ నుంచి నేర్చుకునే ఖర్మ పట్టలేదు!

5 Oct, 2017 13:12 IST|Sakshi

కొచ్చి: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ బీజేపీ, ఆరెస్సెస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేరళలో అమిత్‌ షా పాదయాత్రతో తమ బలమెంతో చాటుతామని బీజేపీ నేతలు బీరాలు పోతున్నారని, కానీ వారి యాత్ర వృథాప్రయాసగానే మిగులుతుందని ఆయన ఎద్దేవా చేశారు.

'మమ్మల్ని భయపెట్టగలరని అనుకోకండి. ఆరెస్సెస్‌ పాత ముఖాలతో, కేంద్రంలో, ఇతర రాష్ట్రాల్లో అధికారం అండతో ఇక్కడ ఏమైనా చేయగలమని అనుకుంటే అది వారి తప్పే అవుతుంది' అని విజయ్‌ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ అండతో దేశంలో లౌకికవాదాన్ని ధ్వంసం చేయాలని బీజేపీ చూస్తోందని ఆయన విమర్శించారు. 'నాథూరాం గాడ్సేనే దేవుడిగా భావించే మీ లాంటి వ్యక్తుల నుంచి శాంతి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం కేరళకు లేదు. మమ్మల్ని భయపెట్టాలని అనుకుంటే.. ఇలాంటి సవాళ్లను స్వీకరించడానికి మేం ఎప్పుడూ సిద్ధంగా ఉంటామనే విషయాన్ని మరువకండి' అని విజయన్‌ బీజేపీ నేతలను హెచ్చరించారు.

కేరళలో అధికార సీపీఎం పాల్పడుతున్న హింసకు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన 'జనరక్షా' పాదయాత్రలో బుధవారం యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రమాదకర ‘లవ్‌ జీహాద్‌’ కట్టడిలో కేరళ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. బెదిరింపులకు దిగి అధికారం చేజిక్కించుకోవడం సీపీఎంకు అలవాటేనని యోగి ధ్వజమెత్తారు.

సనాతన హిందూ సంప్రదాయంలో కేరళకు ప్రముఖ స్థానం ఉందని, విదేశీ కమ్యూనిజం భావాలు అక్కడకి ఎలా ప్రవేశించాయో అర్థం కావడంలేదన్నారు. ‘సీపీఎం ఓ వైపు సామ్యవాద సూత్రాలు వల్లిస్తూనే మరోవైపు జీహాద్‌ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోంది. పవిత్ర భూమి అయిన కేరళలో ఇలాంటి పోకడలకు చోటులేదు. ఇక్కడ కేవలం జాతీయ భావాలకే ప్రచారం కల్పించాలి’ అని అన్నారు. అధికార పార్టీ కనుసన్నల్లోనే రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఓ హిందూ మహిళ మతం మార్చుకుని ముస్లిం వ్యక్తిని పెళ్లాడిన ఉదంతాన్ని ఉదహరిస్తూ...‘లవ్‌ జీహాద్‌’ ప్రమాదకర ధోరణి అని అన్నారు.

మరిన్ని వార్తలు