కేరళ నాకు వారణాసితో సమానం!

8 Jun, 2019 13:55 IST|Sakshi

గురువాయూర్‌ : కేరళ ప్రజలు బీజేపీకి ఓటు వేయపోయినా.. బీజేపీకి వారణాసి ఎంతో.. కేరళ కూడా అంతేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం కేరళ త్రిశూర్‌ జిల్లాలోని గురువాయూర్‌ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పళ్లు, రూపాయి నాణేలతో తులాభారం వేయించుకున్నారు. అనంతరం శ్రీకృష్ణ భగవానున్ని దర్శించుకున్నారు. అనంతరం గురువాయూర్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘మమ్మల్ని గెలిపించిన వారే కాదు.. మమ్మల్ని గెలిపించని వాళ్లు కూడా మావాళ్లే. కేరళలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. అయినా మోదీ ఎందుకు ఇక్కడ మొదటి రాజకీయ ప్రసంగం చేస్తున్నారని మీరు అడగవచ్చు.. నిజానికి వారణాసి ఎంతో కేరళ కూడా మాకు అంతే’ అని మోదీ అన్నారు.

ఎన్నికలు ఎన్నికలు వరకేనని, దేశంలోని యావన్మందీ ప్రజల బాగోగులు చూడటం ప్రభుత్వం బాధ్యత అని మోదీ పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామిక పర్వదిన స్ఫూర్తిని కొనసాగించడంపై ఆయన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ప్రజలకు నా సెల్యూట్‌.. వారే నా దేవుళ్లు’అని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి వివక్షకు తావులేకుండా ప్రజలందరి కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని, తాను ప్రజలందరి సేవకుడినని, గెలుపోటములకు అతీతంగా అందరి సంక్షేమం కోసం తాను కృషి చేస్తానని మోదీ పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలు జనసేవకులు అని, వారు తమ జీవితమంతా ప్రజల సేవకే కట్టుబడి ఉన్నారని అభివర్ణించారు. 
 

మరిన్ని వార్తలు