పదేళ్లలో స్వర్గ తెలంగాణ!

3 Sep, 2018 01:41 IST|Sakshi

ప్రగతి నివేదన సభలో కేకే ధీమా 

కేసీఆర్‌ను దీవించాలని ప్రజలకు పిలుపు 

ప్రభుత్వ పాలనలో నిజాయతీని తెలిపేందుకే సభ 

సాక్షి, హైదరాబాద్‌: ఇంకో ఐదేళ్లు ఈ ప్రభుత్వాన్ని నడుపుకొంటే బంగారు తెలంగాణ పూర్తి చేసుకుంటామని, మరో పదేళ్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటే నిజమైన స్వర్గ తెలంగాణ చేసి ఇస్తారనే నమ్మకం తనకు ఉందని టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్, ఆ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి ప్రజల మద్దతు, ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయన్నారు. మరో ఐదేళ్ల కోసం కేసీఆర్‌ను దీవించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన టీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదన సభలో మాట్లాడుతూ.. నాలుగేళ్ల మూడు నెలల పాలనలో జరిగిన అభివృద్ధిని నిజాయతీ, పారదర్శకతతో ప్రజలకు నివేదించడానికే ప్రగతి నివేదన సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ప్రజాస్వామ్యంలో నిజమైన రాజులు ప్రజలేనని, ప్రజలతో మాట్లాడుకున్న తర్వాతే ఏదైనా పని చేయాలనే ఈ కార్యక్రమాన్ని తలపెట్టామన్నారు. పుట్టినప్పటి నుంచి చివరి రోజు వరకు ప్రజలందరి అవసరాలు తీర్చేందుకు 500 పథకాలను అమలు చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు. దేశంలో నంబర్‌వన్‌ రాష్ట్రంగా తెలంగాణ ప్రశంసలు అందుకుంటోందని పేర్కొన్నారు. రాష్ట్రానికి మిగులు బడ్జెట్‌ ఉందని, జనాభాలో 80 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే ఆ నిధులను ఖర్చు పెట్టాలని సీఎం పదేపదే అంటుంటారని గుర్తు చేశారు. ఎస్సీ, బీసీ కులాలను గుర్తించి వారి కోసం ఆత్మగౌరవ భవనాలు నిర్మించడం పేరుకు మాత్రమేనని, ఈ సభ ద్వారా వారి అభివృద్ధి, సంక్షేమానికి పునరంకితం కావడం అసలు లక్ష్యమన్నారు. 

అల్లా కేసీఆర్‌ను ఇవ్వడం అదృష్టం: మహమూద్‌ అలీ  
‘‘అల్లా మనకు కేసీఆర్‌ లాంటి గొప్ప సీఎంను ఇవ్వడం మన అదృష్టం. రాష్ట్రంలో అన్ని సామాజికవర్గాల ప్రజలు సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మరెక్కడా లేని విధంగా గంగా జమున తెహజీబ్‌ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకం. రాష్ట్రంలో మైనారిటీల అభివృద్ధికి బడ్జెట్‌లో సీఎం రూ.2 వేల కోట్లు కేటాయించారు. దేశంలో మైనారిటీలకు ఇదే అత్య ధిక బడ్జెట్‌. 24.22 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌లో ముస్లింలకు రూ.4,700 కోట్లే ఇచ్చారు.’’ 
– ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ

ఇవ్వని హామీలు కూడా అమలు: కడియం 
ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల్లో 100 శాతం అమలు చేశామని, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా అమ్మ ఒడి, కేసీఆర్‌ కిట్, హెల్త్‌ అండ్‌ హైజీన్‌ కిట్, కంటి వెలుగు పథకాలు, వందల సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు వంటి వాటిని అమలు చేశామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. నిండు మనసుతో సీఎం కేసీఆర్‌ను మరోసారి దీవించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూపొందించిన మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, హరితహారం వంటి కార్యక్రమాల గురించి ప్రధాని, ఇతర రాష్ట్రాల సీఎంలు ఆలోచనలు చేస్తున్నారని చెప్పారు.

తెలంగాణ ఏర్పడ్డాక వ్యవసాయాన్ని పండుగ చేయాలనే లక్ష్యంతో వ్యవసాయ రుణాల మాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్, సమస్యల్లేకుండా ఎరువులు, విత్తనాల పంపిణీ, రైతుబంధు, రైతు బీమా కార్యక్రమాలను అమలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కడియం కొనియాడారు. రైతులకు అండగా ఉన్న కేసీఆర్‌కు అండగా ఉండాలని రైతులకు పిలుపునిచ్చారు. యావత్‌ దేశాన్ని ఆకర్షించిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి అమలు చేసిన ఘనత పరిపాలనా దక్షత కలిగిన కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. నీతి నిజాయతీతో పరిపాలన చేశామని, ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. 

ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తున్న పథకాలు: మహేందర్‌రెడ్డి 
రాష్ట్రంలో ఊహించని రీతిలో అభివృద్ధి, పేదలకు వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రగతి నివేదన సభలో మహేందర్‌రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాల పట్ల ఆకర్షితులైన ఇతర రాష్ట్రాల అధికారులు, ముఖ్యమంత్రులు ఇక్కడికి వచ్చి వాటి గురించి తెలుసుకుంటున్నారని గుర్తుచేశారు. దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రగతి నివేదన సభను తన సొంత జిల్లా రంగారెడ్డిలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అన్ని జిల్లాల నుంచి యువకులు పాదయాత్రగా, సైకిళ్లు, మోటార్‌ సైకిళ్ల మీద సభకు తరలివచ్చారని పేర్కొన్నారు. సీఎం మీద ప్రేమతో ట్రాక్టర్లపై ఒక రోజు ముందే భారీ సంఖ్యలో తరలివచ్చిన రైతులు సభాస్థలి వద్దే శనివారం రాత్రి బస చేశారన్నారు.  

గన్‌మన్‌లు లేకుండా కేటీఆర్‌
సభకు వచ్చే వారు ఎలా వస్తున్నారు, ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉన్నాయా, సక్రమంగా సభాస్థలికి చేరుకుంటున్నారా.. అంటూ మంత్రి కేటీఆర్, హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సభా పరిసర ప్రాంతాలు, ఓఆర్‌ఆర్‌ను పరిశీలించారు. ట్రాఫిక్‌ స్తంభించకుండా అధికారులకు ఎప్పటికప్పుడు అదేశాలు జారీ చేశారు. గన్‌మన్లు లేకుండా రహదారుల వెంట తిరుగుతూ కార్యకర్తల యోగక్షేమాలను కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. 

చంకన బిడ్డతో విధులకు..
ప్రగతి నివేదన సభలో ఓ మహిళా కానిస్టేబుల్‌ చంకలో బిడ్డను ఎత్తుకొని బందోబస్తు నిర్వహించారు. ఓవైపు పెద్దఎత్తున వస్తున్న జనాలను నియంత్రిస్తూనే మరోవైపు తన బిడ్డను చూసుకున్నారు. ఇటు విధి నిర్వహణ.. అటు బిడ్డను చూసుకోవడాన్ని జనాలు ఆసక్తిగా గమనించారు. 

మాట్లాడింది నలుగురే!
సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో నలుగురి ప్రసంగాలతోనే సరిపెట్టే సంప్రదాయం ఈసారీ కొనసాగింది. ప్రగతి నివేదన సభలో ఆనవాయితీ ప్రకారం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌తోపాటు పార్టీ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు, ఇద్దరు ఉపముఖ్యమంత్రులు మహమూద్‌ అలీ, కడియం శ్రీహరి మాత్రమే ప్రసంగించారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2015, 2017లో హైదరాబాద్‌లో నిర్వహించిన పార్టీ ప్లీనరీ సమావేశాల్లో కూడా ఈ నలుగురే ప్రసంగించారు. ప్రగతి నివేదన సభ పేరుతోనే 2017లో వరంగల్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కూడా సీఎం కేసీఆర్‌తోపాటు కె.కేశవరావు, కడియం, మహమూద్‌ అలీ మాత్రమే ప్రసంగించారు. 

మరిన్ని వార్తలు