టీడీపీలో ‘గల్లా’ కలకలం!

11 Feb, 2018 17:58 IST|Sakshi
కేశినేని నాని, కొనకళ్ల నారాయణరావు, గల్లా జయదేవ్‌ (ఇన్‌సెట్‌లో)

జయదేవ్‌కు అధిక ప్రాధాన్యంపై అసంతృప్తి..?

సీఎంతో భేటీకి కేశినేని, కొనకళ్ల గైర్హాజరు

సాక్షి, అమరావతి: టీడీపీలో ఎంపీ గల్లా జయదేవ్‌ వ్యవహారం కలకలం రేపింది. అధికార పార్టీ ఎంపీల మధ్య విభేదాలు టీడీపీ అధినేత చంద్రబాబు సాక్షిగా బయటపడ్డాయి. అందుబాటులో ఉన్న ఎంపీలతో ఆదివారం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి కృష్ణా జిల్లా ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ గైర్హజరయ్యారు.

విజయవాడలో ఉన్నప్పటికీ కేశినేని నాని సమావేశానికి రాలేదు. గల్లా జయదేవ్‌కు అనవసర ప్రాధాన్యం ఇస్తున్నారన్న అసంతృప్తితోనే వీరు సమావేశానికి గైర్హాజరైనట్టు ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి సుజనా చౌదరి వర్గీయులుగా ముద్రపడిన కేశినేని, నారాయణరావు సమావేశానికి రాకపోవడంపై టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.

హంగామా అవసరమా..?
మరోవైపు ఢిల్లీ నుంచి వచ్చిన గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌ నాయుడుతో కలిసి చేసిన హంగామా చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ఏమీ సాధించకుండానే విజయోత్సవాలు నిర్వహించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. బడ్జెట్‌లో జరిగిన అన్యాయాన్ని సరి చేసేందుకు కేంద్రం ఎటువంటి హామీలు ఇవ్వనప్పటికీ, ఏదో సాధించినట్టు టీడీపీ ఎంపీలు విజయోత్సవ ర్యాలీ చేయడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. రాష్ట్రానికి కేంద్రం న్యాయం చేయకపోయినా సంబరాలు చేసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీల్లో చెలరేగిన అసంతృప్తి ఏవిధంగా మారుతుందోన్న చర్చ జరుగుతోంది. కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులపై మిత్రపక్షంగా తాము అసంతృప్తిగా ఉన్నామంటూనే టీడీపీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం కొసమెరుపు.

మరిన్ని వార్తలు