చంద్రబాబు విధానాల వల్లే చేనేత నిర్వీర్యం

18 Oct, 2017 08:24 IST|Sakshi

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

ధర్మవరం: చంద్రబాబు అనుసరిస్తున్న విధానాల వల్లే చేనేత రంగం నిర్వర్యమవుతోందని, చేనేత కార్మికులను కేవలం ఓట్లు వేసేవారిగా చూస్తున్నారే తప్ప వారికి చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆరోపించారు. మంగళవారం చేనేత రిలేదీక్షల సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేతిరెడ్డి మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత సంక్షేమ పథకాలన్నీ ఒక్కొక్కటిగా నిలిపివేస్తున్నారని దుయ్యబట్టారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ముడిరేషం ధరలు రూ.2,400 ఉండేదనీ, అప్పుడే చేనేత ముడిపట్టు రాయితీ పథకం తీసుకువచ్చి ఒక్కో చేనేత కార్మికునికి రూ.600 అందించామని గుర్తు చేశారు. కానీ టీడీపీ ప్రభుత్వం ఆ పథకానికి నిధులు మంజూరు చేయకుండా నిలిపివేసిందన్నారు.

ధర్మవరం వచ్చిన చంద్రబాబు రాయితీ మొత్తాన్ని రూ.600 నుంచి రూ.1,000కి పెంచి కేవలం రెండు నెలలు మాత్రమే ఇచ్చారన్నారు. అదేవిధంగా కమిషన్ల కోసం ఎన్‌హెచ్‌డీసీ పథకాన్ని నిలిపివేశారని, రాష్ట్రమంతా ఆ పథకం అమలవుతుంటే టీడీపీ నాయకుల కమీషన్ల కక్కుర్తి కారణంగా ధర్మవరంలో అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే జిల్లా నుంచి దాదాపు 10 వేల చేనేత కుటుంబాలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లగా...దిక్కుతోచని స్థితిలో 65 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.  చేనేత ముడిపట్టు రాయితీ బకాయిలు చెల్లించాలని తాము 37 రోజులుగా దీక్షలు చేస్తుంటే ఏ ఒక్క అధికారి కూడా స్పందించలేదన్నారు. అదే మంత్రి కొడుకు పెళ్లి చేస్తే..జిల్లాలోని అధికార యంత్రాంగం మొత్తం వారి సేవలోనే మునిగిపోయిందని దుయ్యబట్టారు.  చేనేతల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న ఒక్క వైఎస్సార్‌సీపీ మాత్రమేనన్నారు. చేనేతలకు భరోసా ఇచ్చేందుకు జగన్‌మోహనరెడ్డి ధర్మవరం వచ్చారని, చేనేత కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారికి హామీలు ఇవ్వాలని జగన్‌మోహనరెడ్డిని కోరారు.

ధర్మం కోసం పోరాటం: తోపుదుర్తి
తమకు న్యాయంగా అందాల్సిన పథకాల గురించి చేనేత కార్మికులు పోరాడుతున్నారని, వారు చేస్తున్నది ధర్మం కోసం పోరాటమని రాప్తాడు నియోజవకర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. చేనేతలు చేస్తున్న దీక్షలకు తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేనేతరంగం సంక్షోభంలోకి కూరుకుపోయిందనీ, దగాకోరు చంద్రబాబు పరిపాలనకు అందరం కలసి చరమగీతం పాడుదామన్నారు.

సాయం చేయరేం :  ఆలూరి
చేనేతల ఓట్లతో గెలిచిన చంద్రబాబు ప్రభుత్వం... వారి సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు మాత్రం చేతులు రావడం లేదని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి ఆరోపించారు. దోచుకోవడానికి అలవాటు పడిన అధికారపార్టీ ప్రజాప్రతినిధులకు ప్రజా సమస్యలు పట్టవని, తెలుగుదేశం పార్టీని సాగనంపేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు