‘శ్రీవారి సేవలు ఆన్‌లైన్‌ కాదు.. అంతా క్యాష్‌ లైనే’

25 Sep, 2018 22:20 IST|Sakshi
కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి

సాక్షి, తిరుమల : శ్రీవారి ఆలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి టీటీడీ పాలకమండలిపై విమర్శలు గుప్పించారు. లేని అధికారాన్ని చలాయిస్తున్న పాలకమండలి సభ్యుల తీరువల్ల సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌ సేవలు పేరుకు మాత్రమే ఉన్నాయనీ, అంతా క్యాష్‌లైన్‌ వ్యవహారాలేనని ఆరోపించారు. పాలకమండలి సభ్యులకు కోటా విధానం ఉండడంతో ఆర్జిత సేవ టికెట్లు బ్లాక్‌ మార్కెట్‌లో విచ్చలవిడిగా లభిస్తున్నాయని ఆరోపించారు. టీటీడీ పాలకమండలి సభ్యులకు ప్రోటోకాల్‌ విధానం రద్దుచేసి.. వారి కుంటుంబ సభ్యులకు మాత్రమే దర్శనాలు కల్పించే విధంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు.

శ్రీవేంకటేశ్వరుడి కటాక్షం వల్లనే తన ప్రాణాలు నిలిచాయని చెప్పుకునే చంద్రబాబు తిరుమల కొండపై జరుగుతున్న అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరాలని అన్నారు. కనీసం రిటైర్డ్‌ జడ్జితోనయినా విచారణ జరిపించాలని అన్నారు. ఎంతో భక్తి ప్రపత్తులతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులపై టీటీడీ బోర్డు అనాగరికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. శ్రీకృష్ణ దేవరాలయ కాలంలో మాదిరిగా దర్శనం చేసుకుంటున్న భక్తులను నెట్టివేస్తున్నారని వాపోయారు. ఆపదమొక్కులవాడు.. శ్రీవేంకటేశ్వరుడు తమని ఆదుకుంటాడని భక్తులు కొండకు వస్తుంటే.. దేవుడి నగలు, వజ్రాభరణాలు పోయాయనే ప్రచారం ఇబ్బంది కలిగిస్తోందని అన్నారు. సమాచార హక్కు చట్ట పరిధిలోకి శ్రీవారి ఆలయాన్ని తీసుకురావాలని కేతిరెడ్డి డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా