జేసీపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్‌ 

6 Jan, 2020 07:04 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

దివాకర్‌ ట్రావెల్స్‌ అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమా.. 

సాక్షి, తాడిపత్రి : గడిచిన సార్వత్రిక ఎన్నికలలో ఘోర ఓటమిని చవిచూసిన మాజీ ఎంపీ జేసి దివాకర్‌రెడి మతిస్థిమితం కోల్పోయి పోలీసు వ్యవస్థ, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని  తాడిపత్రి  ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. గన్నెవారిపల్లెకాలనీలో ఆదివారం వైఎస్సార్‌సీపీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలీసు వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీ అనంతపురం రూరల్‌ స్టేషన్‌లో కొన్ని గంటల పాటు వేచి ఉన్నందుకే పోలీసులు, ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో హత్యా రాజకీయాలు చేసి నియోజకవర్గ ప్రజలు, రైతు కుటుంబాలకు చెందిన పలువురిని అదే పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని స్టేషన్లు, జైలుకు పంపి కక్ష తీర్చుకున్న గత చరిత్రను మరచిపోయావా జేసి అని ప్రశ్నించారు.

చదవండి: బీజేపీ మన పార్టీయే అంటున్న జేసీ

పోలీసు వ్యవస్థను అతి నీచంగా మాట్లాడి, తప్పు చేసిన నీపై కేసు నమోదు చేయడం అందుకు సంబంధించి విధులు నిర్వర్తించటం పోలీసుల బాధ్యతని తెలియకపోవడం విచారకరమన్నారు. చట్టం అందరికీ సమానమేనని, తప్పు చేసిన వారిపై చట్టం తన పని తాను చేసుకుపోతుందే తప్ప, అందులో ఎలాంటి కక్షపూరిత చర్యలకు తావుండదన్నారు. మీ హయాంలో పోలీసులు మీకు అనుకూలంగా వ్యవహరించినట్లు ఇప్పటి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో అలానే వ్యవహరిస్తారనుకుంటున్నారని, అలాంటి ఆటలు ఇక సాగవన్నారు. వైఎస్సార్‌సీపీలోకి తనను ఆహ్వానిస్తున్నారు. అని జేసీ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని, నీలాంటి నీచ రాజకీయ నాయకులకు ఎన్నటికీ తమ పార్టీలో చోటు దక్కదన్నారు. ప్రజల సంక్షేమం కోసం తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి నిత్యం పాటు పడుతున్నాడని, అందులో భాగంగానే నాయకులదరం ప్రజల కోసం పని చేస్తున్నామని తెలిపారు. 

కక్ష సాధింపెలా అవుతుంది?
అక్రమంగా బస్సులను తిప్పుతున్న నీ ట్రావెల్స్‌పై ట్రాన్స్‌ పోర్ట్‌ అధికారులు చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు చర్యలు అని ఏ విధంగా చెప్పగలగుతావు. అన్ని ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా ఉంటే అధికారులు బస్సులపై ఎందుకు చర్యలు తీసుకుంటారు. అక్రమంగా బస్సులను తిప్పుతున్నావు కనుకే బస్సులను అధికారులు సీజ్‌ చేస్తున్నారన్నారు. బస్సులకు ఇన్సూరెన్సు సైతం చెల్లించకుండా ఉన్నది వాస్తవం కాదా అన్నది బహిర్గతం చేయాలన్నారు. ఈ విషయమై తాను బహిరంగ చర్చకు సిద్ధమేనని ఎమ్మెల్యే మాజీ ఎంపీ జేసీకి సవాల్‌ విసిరారు.

పోలీసులు ఆలోచించాలి 
ప్రబోధానంద ఆశ్రమం పైదాడి చేసేందుకు దాదాపు 500 మంది కార్యకర్తలను వెంటబెట్టుకొని వెళ్లి అల్లర్లు సృష్టించిన కేసులో ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదో పోలీసులు ఆలోచించాలన్నారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌ గేటుకు తాళాలు వేసి ఓ సామాజిక వర్గానికి చెందిన డీఎస్పీ స్థాయి అధికారిని దూషించిన ఈ విషయమై జేసీపై పోలీసులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.   

మరిన్ని వార్తలు