అవకాశవాది జేసీ

16 Nov, 2017 10:19 IST|Sakshi

మంత్రి పదవి కోసమే భజన

ప్రతిపక్ష నేతపై విమర్శలు సరికాదు

షోలు మాని ప్రజలకు మేలు చేయి

వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

ధర్మవరం:  అవకాశ వాద రాజకీయాలకు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి బ్రాండ్‌ అంబాసిడర్‌ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ధర్మవరం సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ రాయలసీమకు నీరురాకుండా అడ్డుకుంటున్నారని ఎంపీ జేసీతోపాటు రాజసభ సభ్యుడు సీఎం రమేష్‌ విమర్శించడాన్ని తప్పుబట్టారు.  మంత్రి పదవి కోసం ఎవరి వద్దకు వెళితే వారి భజన చేయడం జేసీకి పరిపాటిగా మారిందన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అపర భగీరథుడని, ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డిని యువకుడు.. పనిమంతుడని కొనియాడిన జేసీ ఇప్పుడేమో ఇప్పుడేమో ముఖ్యమంత్రి చం ద్రబాబును తెగపొడిడేస్తున్నాడని ఎద్దేవా చేశారు.

తాను అధికారంలోకి వస్తే తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని తలపించేలా పాలన చేస్తానని జగన్‌ అనడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఏడు నియోజకవర్గాలకు ఎంపీ అయిన వ్యక్తి కేవలం చాగల్లుకు మాత్రమే నీరుకావాలని రాజీనామా డ్రామా ఎందుకు ఆడారని సూ టిగా ప్రశ్నించారు. చాగల్లుకు నీరిస్తే మిలిగిలిన ప్రాంతాలు ఏం కావాలని నిలదీశారు. ఏ ప్రజాప్రతినిధి అయినా తమ ప్రాంత అభివృద్ధిని కోరుకోవడం సహజమేనని, అదే రీతిలో పల్నాడు ప్రాం త నాయకులు పోరాటం చేయడంలో తప్పేముందని ప్రశ్నిం చారు.  పదవుల కోసం ప్రతిపక్ష నేతను తూలనాడటం మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు.

హంద్రీ – నీవా వైఎస్‌ పుణ్యమే
హంద్రీ– నీవా ఎవరి పుణ్యమో జిల్లా ప్రజలందరికీ తెలుసునని, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పుణ్యానే జిల్లాలోకి కృష్ణాజలాలు వస్తున్నాయని  కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. 10శాతం పనులు పూర్తిచేసి, వాటికి ‘పచ్చ’ రంగులు వేసుకున్నంత మాత్రాన ఆ పథకాలన్నీ టీడీపీ నాయకులు తీసుకువచ్చినట్లు కాదన్నారు. 11 కిలోమీటర్ల మేర స్లూయిజ్‌ ద్వారా ధర్మవరం చెరువుకు నీటిని తీసుకొచ్చి తామేదో గొప్ప చేశామని చెప్పుకోవడం టీడీపీ నాయకులకే చెల్లిందన్నారు. ఆ నీటిలో చేపలు వదలాలంటే తమకు వాటాలు కావాలని అడుగుతున్నారని దుయ్యబట్టారు. అయినా నియోజవకర్గంలో మొత్తం 80 చెరువులు ఉన్నాయని, వాటన్నింటినీ నీటితో నింపాలని సూచించారు.  తాగేనీటిలో బల్లులు, ఎలుకలు పడి ఆ నీరు  కలుషితమై ప్రజలు అనారోగ్యానికి గురవుతుంటే పట్టించుకోవడం లేదు కానీ.. ప్రచారాలు మాత్రం గొప్పగా చేసుకుంటున్నారని విమర్శించారు.   తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మూడు దఫాలు తెప్పోత్సవం నిర్వహించామని, రైతులకు పంట పండించేందుకు కూడా నీళ్లు ఇచ్చామని కేతిరెడ్డి గుర్తు చేశారు. షోలు చేయడం మాని ప్రజలకు మేలు చేసేందుకు ప్రయత్నించాలని హితవు పలికారు.

మరిన్ని వార్తలు