చంద్రబాబు, లోకేష్‌లపై సీబీఐ విచారణ చేపట్టాలి

17 Feb, 2020 12:52 IST|Sakshi

సాక్షి, అనంతపురం : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అక్రమాస్తులపై విచారణ జరగాలని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బోగస్‌ కంపెనీల ద్వారా చంద్రబాబు వేల కోట్ల రూపాయలు మళ్లించారని.. ఈ విషయం ఐటీ దాడుల్లో బయటపడిందని పేర్కొన్నారు. చంద్రబాబు పీఏ శ్రీనివాసరావు ఇంట్లో వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు బయటపడ్డాయని తెలిపారు. రూ.2.63 లక్షల నగదు పేపర్ను పట్టుకుని తప్పించుకోవాలని చూస్తే ఎలా అని మండిపడ్డారు. ఐటీ విడుదల చేసిన ప్రెస్ నోట్‌ను టీడీపీ నేతలు క్షుణ్ణంగా చదవాలని సూచించారు.

టీడీపీ హయాంలో వేల కోట్ల అవినీతి జరిగిందని, 50 కోట్ల పనికి టీడీపీ నేతలు 250 కోట్ల బిల్లులు డ్రా చేశారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఫోన్ కలిపింది పీఎస్ శ్రీనివాసరావే అని అన్నారు. చంద్రబాబు అక్రమ లావాదేవీలన్నీ పీఏ శ్రీనివాసరావు ద్వారానే జరిగాయని తెలిపారు. టీడీపీ పాలనలో ప్రజా ధనం లూటీ అయ్యిందని అన్నారు. వేల కోట్ల రూపాయలను టీడీపీ నేతలు జేబుల్లో నింపుకున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేష్లపై సీబీఐ, ఈడీ విచారణ చేపట్టాలని, చంద్రబాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

చదవండి: కొండలను దోచుకోవడంలో జేసీ దిట్ట: కేతిరెడ్డి

మరిన్ని వార్తలు