చేనేతల బతుకులతో ఆటలా?

9 Apr, 2019 10:11 IST|Sakshi
చేనేత నాయకులతో కలసి మాట్లాడుతున్న కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

సాక్షి, ధర్మవరం: మీ రాజకీయ ప్రయోజనాల కోసం చేనేతల బతుకులతో ఆడుకుంటారా? అంటూ టీడీపీ నాయకులపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకుల దాడిలో చేనేత కార్మికుడు చంద్రశేఖర్‌ మృతిచెందాడని ఎల్లో మీడియాలో అసత్య కథనాన్ని ప్రచురించడాన్ని ఆయన తప్పు పట్టారు. సోమవారం ఆయన తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ నాయకుల చిల్లర రాజకీయాలకు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతూ ఎదుటివారిపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. సంబంధం లేని వ్యవహారాలను వైఎస్సార్‌సీపీకి అంటగట్టి ప్రయోజనం పొందాలని చూడడం పరిపాటిగా మారిందన్నారు. విధ్వంసాలు, కుట్రలు చేస్తూ పుకార్లు పుట్టిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. 

పొంతనలేని వివరాలు 
పనిలోకి రాలేదని తన తండ్రి చంద్రశేఖర్‌ను కొట్టారని కొడుకు సుబ్రమణ్యం మార్చి 30న ధర్మవరం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని, అయితే ప్రభుత్వాసుపత్రిలో 29వ తేదీన చికిత్స కోసం చేరినట్లు రికార్డులు ఉన్నాయని కేతిరెడ్డి ఆధారాలతో చూపారు. 29న ఆస్పత్రిలో చేరి పరిస్థితి విషమంగా ఉంటే మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించినట్లు రికార్డులు చెబుతున్నాయన్నారు. అలాగే జరిగి ఉంటే ఎమ్మెల్సీని అక్కడి పోలీసులు ఇక్కడి వారికి ఎందుకు సమాచారం ఇవ్వలేదు.. పరిస్థితి విషమంగా ఉంటే వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అదీ కాక సంఘటన జరిగిన రోజు కేసు నమోదు చేయకుండా పోలీసులు ఎందుకు తాత్సారం చేశారని నిలదీశారు. సదరు చేనేత కార్మికుడు ఈ నెల ఐదో తేదీన చనిపోయాడని, అతడి తొడభాగంలో చికిత్స చేయడం వల్ల కార్డియాక్‌ ఫ్రాక్షన్‌ జరిగిందని వైద్యులు నివేదికలో పొందుపరిచారన్నారు. అందుకే పోలీసులు కేసు నమోదు చేయలేదని స్పష్టం చేశారు. 

రాజకీయ లబ్ధి కోసమే.. 
రాజకీయంగా లబ్ధి పొందేందుకు, వైఎస్సార్‌సీపీపై బురదజల్లేందుకు ఇలా తప్పుడు కథనాలు రాయిస్తున్నారని టీడీపీ నేతలపై కేతిరెడ్డి  మండిపడ్డారు. నష్టం ఎవరికి జరిగినా తాము ఉపేక్షించబోమన్నారు. అయితే ఇద్దరి మధ్య జరిగిన వ్యవహారాన్ని తమకు ఆపాదించి లబ్ధి పొందాలని చూస్తే చూస్తూ ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ధర్మవరం పట్టణంలో 65 మంది చేనేత కార్మికులు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడితే పట్టించుకోని తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని చేనేత కార్మికులను పావుగా వాడుకోవాలని చూస్తున్నారన్నారు. ఎవరు ఎలాంటి వారో.. నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని, ఈ కేసును సిట్టింగ్‌ జడ్డితో విచారణ జరిపించి, అలసత్వం  వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో చేనేత నాయకలు గిర్రాజు నగేష్, గిర్రాజు రవి, దాసరి లక్ష్మినారాయణ, బండారు ఆదినారాయణ, ఉడుముల రాము, బీవీఆర్‌ శ్రీనివాసులు, గడ్డం శ్రీనివాసులు, జయశ్రీ, సిద్ది రాజేష్, గుర్రం రాజు, మేకల కిష్ట, సందా రాఘవ, కలిమిశెట్టి మురళి, డీఎల్‌ నాగభూషణ, కేతా గోపాల్, గడ్డం రాజ, కాచర్ల అంజి, పాలబావి శీనా పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు