'బాబూ శవరాజకీయాలు మానుకో'

11 Jul, 2019 08:18 IST|Sakshi

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

సాక్షి, ధర్మవరం(అనంతపురం) : చంద్రబాబు పరిపాలన చేసిన 5 సంవత్సరాల వ్యవధిలో జిల్లాలో 130 మంది రైతులు, 75 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా ఏనాడూ వారిని పరామర్శించేందుకు రాని వ్యక్తి ఇప్పుడు అన్నదమ్ముల మధ్య స్థలవివాదంలో జరిగిన గొడవ కారణంగా ఒక వ్యక్తి మృతి చెందితే శవరాజకీయాలు చేసేందుకు వచ్చాడని చంద్రబాబుపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుధవారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తాడిపత్రి , ధర్మవరంలో జరిగిన సంఘటనలు చంద్రబాబు ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో జరిగిన సంఘటనలేనని గుర్తుచేశారు. అయినా చంద్రబాబు హయాంలో పార్టీల వారీగా ప్రజలను విభజించి విభేదాలను రగిల్చాడని, ఇప్పుడు ఆ నింద తమపై వేస్తున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబు సొంత జిల్లాలో ఇసుక అక్రమ రవాణా కారణంగా 21 మంది మృతి చెందారని, అంతెందుకు తాడిపత్రిలో మట్కాబీటర్లను అరెస్ట్‌ చేసేందుకు వచ్చిన సీఐని చితకబాదిన సంఘటన, ఆశ్రమ వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటనలు ఎవరి హయాంలో జరిగాయో జిల్లా ప్రజలు ఇంకా  మరువలేదన్నారు. చంద్రబాబు, టీడీపీ నాయకులు  చేసిన పాపాల కారణంగా మీకు ప్రజలు బాగా బుద్ధిచెప్పారనడానికి వారికి వచ్చిన 23 సీట్లే నిదర్శనమన్నారు.  

హిట్‌లిస్ట్‌లు అనౌన్స్‌ చేసి హతమార్చారు 
పరిటాల కుటుంబానికి ధర్మవరం ఇన్‌చార్జ్‌ బాధ్యతల విషయమై కేతిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఆర్‌ఓసీ సంస్థ స్థాపన వెనుక ఎవరున్నారో ? ఆ సంస్థ చేసిన హత్యల వెనుక ఎవరున్నారో అందరికీ తెలిసిందేనన్నారు. తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారికి హిట్‌లిస్ట్‌లు ప్రకటించి మరీ హత్యలు చేసిన మాట వాస్తం కాదా ? అని ప్రశ్నించారు.  తాము 25 ఏళ్లుగా ధర్మవరం నియోజకవర్గ ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్నామని, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు. ధర్మవరానికి ఎవరు వచ్చినా తమకు అభ్యంతరం లేదని, ధర్మవరం నియోజకవర్గంలో పరిటాల హయాంలో జరిగిన హత్యలకు క్షమాపన చెప్పి మరీ నియోజకవర్గంలోకి అడుగుపెట్టాన్నారు. అక్కడలా ఇక్కడ వారి హడావుడి వ్యవహారాలు చెల్లబోవని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు.     

మరిన్ని వార్తలు