‘మహా’ రాజకీయం: ఎప్పుడు ఏం జరిగిందంటే..

26 Nov, 2019 17:00 IST|Sakshi

ముంబై : అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలుబడినప్పటీ నుంచి మహా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ బీజేపీకి మద్దతుగా నిలువడంతో అక్కడ హైడ్రామా నెలకొంది. రాత్రికి రాత్రే మహా రాజకీయంలో కీలక పరిణామలు చోటుచేసుకోవడంతో.. ఎప్పుడు ఏం జరుగుతుందా అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తున్న ‘మహా సంక్షోభం’లో ఎప్పుడు ఏం జరిగిందో ఓసారి పరిశీలిస్తే..

అక్టోబర్‌ 21 : గత నెల 21వ తేదీన మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కూటమిగా బరిలో దిగగా, కాంగ్రెస్‌, ఎన్సీపీలు కలిసి పోటీ చేశాయి. 

అక్టోబర్‌ 24 : మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వెలుబడ్డాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 స్థానాల్లో విజయం సాధించాయి. మిగిలిన స్థానాల్లో స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీల అభ్యర్థులు గెలుపొందారు. మొత్తంగా 161 స్థానాలో విజయం సాధించిన బీజేపీ, శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అంతా భావించారు. 

అక్టోబర్‌ 25 - నవంబర్‌ 9 : ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి శివసేన, బీజేపీ కూటమిలో విభేదాలు తలెత్తాయి. సీఎం పదవిని ఇరు పార్టీలు పంచుకోవాల్సిందేనని శివసేన డిమాండ్‌ చేసింది. అయితే శివసేన డిమాండ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని బీజేపీ స్పష్టం చేసింది. బీజేపీ తమ డిమాండ్‌పై సానుకూలంగా లేకపోవడం శివసేన నేతలు తెరవెనక ఎన్సీపీతో మంతనాలు జరిపారు. ఓవైపు శివసేన కూటమి ధర్మాన్ని విస్మరించిందని బీజేపీ నాయకులు, మరోవైపు బీజేపీనే మాట తప్పిందని శివసేన నాయకులు విమర్శలకు దిగారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి శివసేన, బీజేపీల మధ్య సయోధ్య కుదర్చడానికి  ఆరెస్సెస్‌తో పాటు పలువురు బీజేపీ పెద్దలు ప్రయత్నాలు చేసినప్పటికీ అవి విఫలమయ్యాయి. చివరకు ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని శివసేన నిర్ణయించుకుంది. ఆ మేరకు చర్చలను ముమ్మరం చేసింది. 

నవంబర్‌ 9 : మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియడం, ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ ముందుకు రాకపోవడంతో.. గవర్నర్‌ భగత్‌సింగ్ కోశ్యారీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు అహ్వానించారు. 

నవంబర్‌ 10 : గవర్నర్‌ ఆహ్వానంపై స్పందించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు తమకు పూర్తి స్థాయిలో మెజారిటీ లేదని తెలిపింది. దీంతో గవర్నర్‌ రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనను  ప్రభుత్వ  ఏర్పాటుకు ఆహ్వానించడంతో పాటు మెజారిటీ నిరూపించుకునేందుకు 24 గంటల గడువు విధించారు.

నవంబర్‌ 11 : గవర్నర్‌ పిలుపుపై స్పందించిన శివసేన.. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు 3 రోజుల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. అయితే సేన విజ్ఞప్తిని గవర్నర్‌ తిరస్కరించారు. అనంతరం మూడో అతిపెద్ద పార్టీగా ఉన్న ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించారు. అందుకోసం వారికి 24 గంటల సమయం ఇచ్చారు.

నవంబర్‌ 12 : తమ విజ్ఞప్తిని గవర్నర్‌ తిరస్కరించడాన్ని శివసేన సుప్రీం కోర్టులో సవాలు చేసింది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో.. గవర్నర్‌ నివేదిక ఆధారంగా కేంద్ర కేబినెట్‌ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసింది. దీంతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. 

నవంబర్‌ 13-21 : మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ నేతలు తప్పుబట్టారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన నేతలు ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతలతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఎన్నికల్లో కూటమిగా బరిలో దిగిన కాంగ్రెస్‌, ఎన్సీపీలు కూడా శివసేనకు మద్దతిచ్చే అంశంపై పలుమార్లు చర్చలు జరిపాయి. అయితే ఈ మధ్య కాలంలో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడం చర్చనీయాశంగా మారింది. రాష్ట్రంలోని రైతుల సమస్యలపై  మోదీతో పవార్‌  చర్చించినట్లు ఎన్సీపీ వర్గాలు వెల్లడించాయి. 

నవంబర్‌ 22 : ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో శివసేన జరిపిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. మహా వికాస్‌ అఘాడిగా ఏర్పడిన మూడు పార్టీలు  ఉమ్మడిగా ప్రభుత్వ ఏర్పాటుపై ఓ నిర్ణయానికి వచ్చాయి. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వంపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. 

నవంబర్‌ 23 : బీజేపీ తెరవెనక జరిపిన మంతనాలతో మహారాష్ట్రలో రాజకీయాలు రాత్రికి రాత్రే మారిపోయాయి. ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ ఆ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీకి మద్దతు తెలిపారు. దీంతో ఉదయం 5.47 గంటలకు మహారాష్ట్రలో రాష్ట్రపత్తి పాలన ఎత్తివేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే  దేవేంద్ర ఫడ్నవీస్‌ ముఖ్యమంత్రిగా, అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పరిణామాలు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లను ఒక్కసారిగా షాక్‌కు గురిచేశాయి. అజిత్‌ పవార్‌ వెంట ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. శరద్‌ పవార్‌ మాత్రం తమ మద్దతు శివసేనకే ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఎవరు అజిత్‌ వెంట లేరని ఆయన తేల్చిచెప్పారు. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా అజిత్‌ పవార్‌ను ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా తొలగించారు.

అలాగే.. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ నేతలు సుప్రీంను ఆశ్రయించారు. తమ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. 

నవంబర్‌ 24 : శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. విశ్వాస పరీక్షపై వెంటనే ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది. ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్‌, ఫడ్నవీస్‌ లేఖలను ముందుగా పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. తదుపరి విచారణను 25వ తేదీకి వాయిదా వేసింది.

మరోవైపు మహారాష్ట్రలోని పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తమ ఎమ్మెల్యేలను వివిధ హోటల్స్‌లో ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించాయి. అలాగే ఉద్దవ్‌, శరద్‌పవార్‌లు శిబిరాల్లో ఉన్న తమ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. కచ్చితంగా తాము ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

నవంబర్‌ 25 : శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీల పిటిషన్‌లపై విచారణ జరిపిన సుప్రీం అసెంబ్లీ బలపరీక్షకు సంబంధించిన తీర్పును 26వ తేదీ ఉదయం 10.30 వెలువరించనున్నట్టు తెలిపింది. ఇదిలా ఉంటే సాయంత్రం ముంబైలోని గ్రాండ్‌ హయత్‌ హోటల్‌లో మహా వికాస్‌ అఘాడి బలప్రదర్శనకు దిగింది. తమ వెంట 162 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆ పార్టీల నేతలు స్పష్టం చేశారు. కచ్చితంగా తామే ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

నవంబర్‌ 26 : మహారాష్ట్ర అసెంబ్లీలో 27వ తేదీన సాయంత్రం 5 గంటలలోపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. సుప్రీం తీర్పు తరువాత మహారాష్ట్రలో పరిణామాలు వేగంగా మరిపోయాయి. సుప్రీం తీర్పును శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతలు స్వాగతించారు. ఇదిలా ఉంటే సుప్రీం తీర్పు వెలువరించిన కొద్ది గంటల్లోనే.. డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ తన పదవికీ రాజీనామా చేశారు. ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన సీఎం ఫడ్నవీస్‌ కూడా తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రజాతీర్పుకు శివసేన వెన్నుపోటు పోడిచిందని విమర్శించారు. 

మరిన్ని వార్తలు