కీ సెగ్మెంట్స్‌

18 Mar, 2019 08:32 IST|Sakshi

మెజారిటీ విజయాలు బీజేపీవే..: విదిశ : మధ్యప్రదేశ్‌లోని 29 పార్లమెంటు నియోజకవర్గాల్లో విదిశ ఒకటి. 1967 నుంచి ఇది అస్తిత్వంలోకి వచ్చింది. దీని పరిధిలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు (భోజ్‌పూర్, సాంచి, సిల్వని, విదిశ, బసోడ, బుద్ని, ఇచావర్, ఖటేగావ్‌) ఉన్నాయి. 1967 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 12 సార్లు, కాంగ్రెస్‌ రెండు సార్లు గెలిచింది. జనతా పార్టీ ఒకసారి విజయం సాధించింది. 1967, 1971 ఎన్నికల్లో బీజేపీ పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్‌ పోటీ చేసి గెలిచింది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ 2009,2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి గెలిచారు. గత ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్‌ అభ్యర్థి లక్ష్మణ్‌ సింగ్‌పై 4,10,698 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. మాజీ ప్రధాని వాజపేయి 1991లో ఈ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ 1996 నుంచి వరసగా నాలుగు సార్లు ఇక్కడ నుంచి గెలిచారు.

అద్వానీ హవా : గాంధీనగర్‌
గుజరాత్‌లోని 26 లోక్‌సభ స్థానాల్లో కీలకమైనది గాంధీనగర్‌. 1967 నుంచి ఈ నియోజకవర్గం అస్తిత్వంలోకి వచ్చింది. దీని పరిధిలో ఏడు శాసనసభ నియోజకవర్గాలు (గాంధీనగర్‌ ఉత్తర్, కలోల్, సనంద్, ఘటియోదియా, వెజల్‌పూర్, నారన్‌పురా, సబర్మతి) ఉన్నాయి. మొదటి నాలుగు ఎన్నికల్లో మూడు సార్లు కాంగ్రెస్, ఒకసారి జనతా పార్టీ అభ్యర్థులు  గెలిచారు. 1989 నుంచి ఈ నియోజకవర్గంలో బీజేపీ హవాయే కొనసాగుతోంది. అద్వానీ, వాజపేయి ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఎల్‌కే అద్వానీ కాంగ్రెస్‌ అభ్యర్థి కిరీత్‌ భాయ్‌ ఈశ్వర్‌భాయ్‌ పటేల్‌పై 4,83,121 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 1998 నుంచి అద్వానీ ఈ నియోజకవర్గంలో వరసగా ఐదుసార్లు గెలిచారు.1967 నుంచి 2014 వరకు మొత్తం14 సార్లు ఎన్నికలు జరగ్గా బీజేపీ తొమ్మిది సార్లు విజయం సాధించింది.

కమలానికి మంచి పట్టు : న్యూఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో ముఖ్యమైనది న్యూఢిల్లీ. 1951 నుంచి ఇది ఉనికిలోకి వచ్చింది. ఢిల్లీలో ప్రస్తుతం ఉన్న లోక్‌సభ నియోజకవర్గాల్లో అతి పురాతనమైనది న్యూఢిల్లీ నియోజకవర్గం. ఇక్కడ బీజేపీకి గట్టి పట్టు ఉంది. బీజేపీ ఇక్కడ నాలుగు సార్లు గెలిచింది. దీని పరిధిలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు (కరోల్‌బాగ్, పటేల్‌ నగర్, మోతీనగర్, ఢిల్లీ కంటోన్మెంట్,  రాజీందర్‌ నగర్, న్యూఢిల్లీ,  కస్తూర్బా నగర్, మాలవీయ నగర్, ఆర్‌కే పురం, గ్రేటర్‌ కైలాష్‌) ఉన్నాయి. 2014 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి మీనాక్షి లేఖి ఆప్‌ అభ్యర్థి ఆశిష్‌ ఖేతన్‌పై 1.62 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

మెజారిటీ కాంగ్రెస్‌దే..:గుర్‌దాస్‌పూర్‌
పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన లోక్‌సభ నియోజకవర్గమిది. ఈ రాష్ట్రంలో మొత్తం 13 ఎంపీ స్థానాలున్నాయి. దీని పరిధిలో తొమ్మిది శాసనసభ నియోజకవర్గాలు (పఠాన్‌కోట్, దినానగర్, క్వాడియన్, బటాలా, ఫతేగఢ్‌ చురియా, డేరాబాబా నానక్, గురుదాస్‌పూర్, సుజన్‌పూర్, భోవా) ఉన్నాయి. 1952 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ 12 సార్లు గెలిచింది. బీజేపీ నాలుగుసార్లు, జనతా పార్టీ ఒకసారి గెలిచాయి. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు వినోద్‌ ఖన్నా ఈ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు గెలిచారు. 2017లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి సునీల్‌ జక్కర్‌ బీజేపీ అభ్యర్థి స్వరణ్‌ సలారియాపై 1,93,219 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. వినోద్‌ ఖన్నా మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది.

ఎన్‌సీపీ నుంచి పీడీపీకి..: శ్రీనగర్‌
జమ్ము, కశ్మీర్‌లోని ఆరు లోక్‌సభ నియోజకవర్గాల్లో రాజధాని పేరుతో ఏర్పాటైన నియోజకవర్గమిది. దీని పరిధిలో 15 శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. 1967 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ 11 సార్లు విజయం సాధించింది. 2014లో ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ నాయకత్వంలోని పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) మొదటి సారి గెలిచింది. బీజేపీ సహకారంతో ఈ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తిరుగుబాటు తీవ్రం కావడంతో 1991లో ఇక్కడ ఎన్నికలు జరగలేదు. ఇక్కడ కాంగ్రెస్‌ ఒక్కసారి మాత్రమే (1996) గెలిచింది. 2017లో జరిగిన ఉప ఎన్నికలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అభ్యర్థి ఫరూక్‌ అబ్దుల్లా పీడీపీ అభ్యర్థి నజిర్‌ అహ్మద్‌ఖాన్‌పై10,776 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. మొత్తం ఓటర్లు: 12,05,233

మరిన్ని వార్తలు