కుంతియాకు అవమానం జరిగిందా?

1 Jun, 2018 15:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రామచంద్ర కుంతియాకు అవమానం జరిగిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తనకు జరిగిన అవమానంపై ఆయన  కాంగ్రెస్‌ బస్సుయాత్ర కోఆర్డినేషన్‌ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.  ‘నేను ఇన్‌చార్జ్‌గా ఉన్నా కదా. గులాం నబీకి స్వాగతం అంటూ సోషల్‌ మీడియాలో ఎలా పోస్ట్‌ చేస్తారు. అధిష్టానం నుంచి అధికార ప్రకటన రాకముందే ఇలా చేసి నన్ను అవమానించినట్టే. నేనే ఇన్‌చార్జ్‌గా ఉండాలని నాకేం లేదు. కానీ పార్టీ ప్రకటించిన తర్వాత ఏమైనా చేసుకోండి. అనవసరంగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోవద్దో చెప్పాలని కుంతియా ఆగ్రహం చెందినట్లు తెలుస్తోంది.’

కాగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోఅధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గ వ్యూహంతో ముందుకు వెళుతోంది. ప్రస్తుత ఇన్ఛార్జ్ కుంతియా స‌మ‌ర్థ‌వంతంగా పని చేయ‌డం లేదని భావించిన అధిష్టానం తాజాగా ఆజాద్ పేరును పరిశీలనకు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌ను నియమించనుందని తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన చేయనుంది. అయితే అధికారిక ప్రకటన రాకముందే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు పలువురు ఆజాద్‌ రాకను స్వాగతిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడంపై కుంతియ కినుక వహించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు