చంద్రబాబు ఓ మోసకారి 

20 Feb, 2019 04:02 IST|Sakshi
లోటస్‌పాండ్‌లో వైఎస్‌ జగన్‌ను కలసి పుష్ఫగుచ్చం అందిస్తున్న కిల్లి కృపారాణి దంపతులు

హోదాపై ద్వంద్వ వైఖరితో ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాడు

కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ధ్వజం

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌తో భేటీ

28న వైఎస్సార్‌సీపీలో చేరనున్నట్లు వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: చంద్రబాబు ఓ మోసకారి అని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై ద్వంద్వ వైఖరి అవలంభించి రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశాడని మండిపడ్డారు. నాడు హోదా వద్దన్న చంద్రబాబు.. ఇప్పుడు ప్రజల్ని మభ్యపెట్టేందుకు హోదా కోసం పోరాడుతున్నట్లు షో చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కిల్లి కృపారాణి మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. వైఎస్సార్‌సీపీలో చేరాలన్న తన అభీష్టాన్ని జగన్‌కు తెలియజేశారు. అంతకుముందు ఆమె కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. భేటీ అనంతరం కిల్లి కృపారాణి వైఎస్‌ జగన్‌ నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. ఈనెల 28న అమరావతిలో జరిగే కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీలో చేరుతానని ప్రకటించారు. వైఎస్‌ జగన్‌పై ప్రజలకున్న అభిమానాన్ని ఎంతిచ్చినా చంద్రబాబు కొనలేడన్నారు. అక్షర క్రమంలోనే కాదు.. అభివృద్ధిలోనూ ఏపీ ముందుండాలన్న జగన్‌ ఆకాంక్షకు ఆకర్షితురాలినయ్యానని చెప్పారు.

దేశ స్వాతంత్య్రానంతరం ఏ నాయకుడు చేసిన పాదయాత్ర కూడా.. ప్రజాసంకల్ప యాత్రలాగా విజయవంతం కాలేదన్నారు. దాదాపు 3,600 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన జగన్‌.. నిత్యం ప్రజల మధ్యే ఉండి వారి సమస్యలు తెలుసుకున్నారన్నారు. రాష్ట్రంలో 50 శాతం జనాభాగా ఉన్న బీసీలను చంద్రబాబు ఓట్ల కోసం వాడుకుంటున్నాడని విమర్శించారు. బీసీల ఓట్లతో గద్దెనెక్కి.. చివరకు వారినే పక్కన బెట్టారన్నారు. బీసీ గర్జన ద్వారా వారి అభివృద్ధికి ఏమేం చేస్తానో జగన్‌ చాలా స్పష్టంగా చెప్పారన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత, ఏటా రూ.15 వేల కోట్లు కేటాయిస్తానంటూ జగన్‌ ఇచ్చిన హామీలు బీసీలకు మనోధైర్యం కలిగించాయన్నారు. ప్రతి బీసీ కులానికి కార్పొరేషన్‌ ఏర్పాటు ఓ విప్లవాత్మక నిర్ణయమని కొనియాడారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడైన దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్‌పై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు.  

బాబు మాటలను ప్రజలు విశ్వసించరు.. 
గత అయిదేళ్లుగా చంద్రబాబు వ్యవహార శైలి చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని కృపారాణి అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటిస్తే.. దాన్ని చంద్రబాబు తన ఖాతాలోకి వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లు అంటకాగిన బీజేపీ పైనా.. ప్రధాని మోదీపైనా చంద్రబాబు ఇప్పుడు విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీనే బాగుందని, దానివల్లే రాష్ట్రానికి మేలు జరుగుతుందంటూ చంద్రబాబు అర్ధరాత్రి సమావేశం పెట్టి కేంద్రాన్ని అభినందించడాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు.

మరిన్ని వార్తలు