కిమ్‌ సోదరికి పార్టీ పదవి!

10 Oct, 2017 20:25 IST|Sakshi

ఉత్తర కొరియా అగ్రనేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తన సోదరి కిమ్‌ యో జాంగ్‌కు పాలక వర్కర్స్‌ పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పించారు. పార్టీ 72వ వార్షికోత్సవం సందర్భంగా కిమ్‌ తన స్థానం పటిష్టం చేసుకోవడానికి తీసుకున్న చర్యగా ‘యో’ నియామకాన్ని పరిగణిస్తున్నారు. అన్న కిమ్‌ లాగాగానే 28 ఏళ్ల యో స్విట్జర్లండ్లో  చదువుకున్నారు. మాజీ పాలకుడు కిమ్ జాంగ్‌ ఇల్‌ మూడో లేదా నాలుగో భార్య సంతానమైన కిమ్, యో తోబుట్టువులు. జుత్తు వెనక్కి దువ్వుకుని, నిత్యం నల్ల సూట్లు ధరించే యోకు నలుపు రంగు హైహీల్డ్ షూస్‌ అంటే  ఇష్టం. ఒకే కుటుంబం నాయకత్వాన నడిచే ఉత్తర కొరియా కమ్యూనిస్ట్‌ పార్టీలో ఉన్నత పదవి పొందిన రెండో మహిళ యో.

ఇంతకు ముందు ఆమె మేనత్త అంటే తొలి పాలకుడు, దేశ స్థాపకుడు కిమ్ ఇల్‌ సంగ్‌ కూతురు కిమ్‌ క్యోంగ్‌ హుయీ కూడా తన అన్న కిమ్‌ జాంగ్‌ ఇల్‌ హయాంలో కీలక పదవులు నిర్వహిస్తూ అధికారం చెలాయించారు. అయితే, రాజధాని ప్యోంగ్యాంగ్లో నంబర్‌ టూగా ఒకప్పుడు వెలుగొందిన ఆమె భర్త జాంగ్‌ సాంగ్‌ తాయిక్‌ను దేశద్రోహ నేరంపై ప్రస్తుత పాలకుడు కిమ్ 2013లో కాల్చి చంపించారు. భర్తకు మరణశిక్ష అమలు చేశాక ఆమె గుండెపోటుతో మరణించారనీ లేదు, ఆమె ఆత్మహత్య చేసుకున్నారని కూడా అప్పట్లో వార్తలొచ్చాయి. మద్యానికి బానిసైన ఆమె బతికే ఉన్నారనీ, చికిత్స పొందుతున్నారని  దక్షిణ కొరియా వార్తాసంస్థ యాన్హాప్ ఈ ఏడాదే ప్రకటించింది.

ఓ పక్క సవతి అన్న హత్య మరో పక్క చెల్లెలికి పదవి!
కిమ్ మారుటి సోదరుడు కిమ్‌ జాంగ్‌ నామ్‌ తమ్ముడికి దూరంగా చైనాలోని మకావ్లో విలాసవంతమైన జీవితం గడుపుతుండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మలేసియా రాజధాని  కౌలాలంపూర్ విమానాశ్రయంలో ఆయనను విషవాయువు ప్రయోగంతో హత్య చేయించిన విషయం తెలిసిందే. ఈ హత్యకేసులో నిందితులైన ఇద్దరు మహిళలు(ఒకరు ఇండొనీసియన్, మరొకరు వియత్నాంకు చెందిన స్త్రీ) మలేసియా కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న సమయంలో కిమ్‌ తన సోదరిని అలంకారప్రాయంగా పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా నియమించడం విశేషం. కిమ్‌ జాంగ్‌ నామ్‌ హత్యకు కిమ్ కారణమని అమెరికా భావిస్తోంది.  

స్విస్‌ చదువయ్యాక ప్యోంగ్యాంగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ చదవింది!

అన్న మాదిరిగా స్విట్జర్లండ్లో యో పాఠశాల విద్య పూర్తి చేసుకుంది. తర్వాత ఆమె రాజధానిలోని కిమ్ ఇల్‌ సంగ్‌ యూనివర్శిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదివారని తెలుస్తోంది. ఇదే వర్సిటీలో చదివిని ఓ యువకుడిని ఆమె పెళ్లాడారని దక్షిణ కొరియా ఇంటెలిజన్స్ అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ విషయం అధికారికంగా ఎవరూ నిర్ధారించలేదు. ఆమె బయటి ప్రపంచానికి కనిపించడం చాలా అరుదు. అన్నతో కలిసి మాత్రమే ఆమె అనేక సంగీత కచ్చేరీలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో హుషారుగా పాల్గొనడం అలవాటు. తెల్ల గుర్రంపై స్వారీచేస్తూ యో ఓ సందర్భంలో కనిపించారు. కిమ్, యోల సొంత అన్న  కిమ్‌ జాంగ్‌ చోల్‌ రాజకీయాలకు దూరంగా ప్యోగ్యాంగ్లో ప్రశాంతంగా జీవిస్తున్నాడు. ఓ మ్యూజిక్‌ బ్యాండ్‌లో గిటార్‌ వాయిస్తూ   బతికేస్తున్నాడు.

(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

>
మరిన్ని వార్తలు