అభివృద్ధి, సంక్షేమాలే గెలిపించవు 

18 Jun, 2019 04:38 IST|Sakshi
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌

కమీషన్ల కోసమే పోలవరం అంచనాలు పెంచామనుకుంటే.. తక్కువ మొత్తానికే పనులు చేయించండి 

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు 

సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సర్వసాధారణమని, తాము ఎందుకు ఓడిపోయామో విశ్లేషించుకుంటామని తెలుగుదేశం ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సోమవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఎన్నికల్లో గెలిపించవని, అనేక అంశాలు పనిచేస్తాయని పేర్కొన్నారు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ గత ఐదేళ్లు ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందంటూ ఇదే అసెంబ్లీలో మాట్లాడి.. ఇప్పుడు గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని అనడం సమంజసంగా లేదని అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు సభలో వివాదానికి దారితీశాయి. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ కలుగజేసుకుని ‘ప్రభుత్వ విజన్‌ డాక్యుమెంట్‌నే గవర్నర్‌ చదువుతారు.

ఈ విషయం సీనియర్‌ శాసన సభ్యులకు తెలిసీ ఇలా మాట్లాడటం సరికాదు. గవర్నర్‌ను వివాదాస్పదం చేయడం సమంజసం కాదు..’ అని హితవు పలికారు. స్పీకరు తమ్మినేని సీతారాం కలగజేసుకుని ఇలా మాట్లాడటం సరికాదని అచ్చెన్నాయుడికి హితవు చెబుతూ ‘మన గవర్నర్‌ను మనం గౌరవించాలి’ అని సూచించారు. అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ‘కొత్త ప్రభుత్వానికి గవర్నర్‌ మొదటి ప్రసంగం అయిదేళ్ల విజన్‌ డాక్యుమెంట్‌. కాదంటే ఏడాది డాక్యుమెంట్‌. ఇందులో ఎక్కడా అమరావతి ప్రస్తావన లేదు. ఇందులో విజన్‌ లోపించింది. పట్టిసీమ కోసం నిధులు వృథా చేశారంటున్నారు. దాని ఫలితాలు కూడా చెప్పండి. పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్రభుత్వమే మాకు ఇచ్చింది. ప్రాజెక్ట్‌ను మాకు ఇవ్వాలని సంతకం పెట్టినట్టు డాక్యుమెంటు ఉంటే ఇవ్వండి. పోలవరంలో 70% పనులు పూర్తి చేశాం. మిగిలిన పనులు 6 నెలల్లోనో, ఏడాదిలోనో పూర్తి చేయండి. అయినా, ఇరిగేషన్‌ అంటే ఏమీ తెలియని వ్యక్తి నిష్ణాతుడైన చంద్రబాబుకు నీతులు చెబుతుంటే బాధగా ఉంది’ అని జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ను ఉద్దేశించి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. 

నేను పప్పును కాదు : మంత్రి అనిల్‌ కౌంటర్‌ 
‘నేను కొత్తగా వచ్చాను. నాకు నీటిపారుదల రంగం గురించి ఎక్కువగా తెలియకపోవచ్చు. కానీ నేను డాక్టర్‌ని. నేర్చుకుంటా. ఆయన (చంద్రబాబు) కొడుకులాగా నేను పప్పును కాదు. మంగళగిరి అనడం రాక మందలగిరి అనే వ్యక్తిని కాదు. నాకు జల వనరుల శాఖపై పెద్దగా అవగాహన లేనంత మాత్రాన ఆయన (చంద్రబాబు) దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా?’ అంటూ జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. ‘నీటి బొట్టు లేకుండా నీరు–చెట్టులో రూ.18 వేల కోట్లు మింగేశారు. పోలవరాన్ని సోమవారం అంటూ నిధులు దండుకున్నారు. ధర్మ పోరాట దీక్ష పేరుతో రూ.500 కోట్లు నాకేశారు. అలీ బాబా నలభై దొంగల్లా అలీబాబు 23 దొంగలు తయారయ్యారు’ అంటూ అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు.  

>
మరిన్ని వార్తలు