రైతుల కోసం ‘ఉద్యమం’

11 Jun, 2019 01:54 IST|Sakshi
సోమవారం గాంధీభవన్‌లో మాట్లాడుతున్న శశిధర్‌రెడ్డి. చిత్రంలో అన్వేష్‌రెడ్డి, కోదండరెడ్డి

కార్యాచరణ రూపొందిస్తున్న కిసాన్‌ కాంగ్రెస్‌

రైతుబంధు అమలు, రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులే ఎజెండా

ప్రకృతి వైపరీత్యాలకింద ఎంత ఖర్చు పెట్టారో వెల్లడించాలని డిమాండ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలపై ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని కిసాన్‌ కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఇందుకోసం ఉద్యమ కార్యాచరణను రూపొందించి, రైతుల భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా పోరాటానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం అమలుతోపాటు రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలనే డిమాండ్‌తో ఉద్యమాలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం గాంధీభవన్‌లో జరిగిన రాష్ట్ర కిసాన్‌ కాంగ్రెస్‌ సమావేశంలో తీర్మానించారు. రాష్ట్ర కిసాన్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ అన్వేశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భూరికార్డులు, పట్టాదారు పాసుపుస్తకాలతోపాటు మొత్తం 9 అంశాలపై చర్చించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి ఆరునెలలవుతున్నా ఇంతవరకు రుణమాఫీ చేయలేదని, ధాన్యం కొనుగోళ్లు చేసి ఇంతవరకు డబ్బులు చెల్లించలేదని కిసాన్‌ కాంగ్రెస్‌ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ అంశాలన్నింటిపై రైతులతో కలిసి ఉద్యమం చేయాలని నిర్ణయించారు.

సమావేశం అనంతరం ఏఐసీసీ కిసాన్‌సెల్‌ వైస్‌చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, భూరికార్డుల ప్రక్షాళన అనంతరం రాష్ట్రంలోని 6 లక్షలకుపైగా రైతులకు కొత్త పాసుపుస్తకాలు అందలేదని, వీరికి రైతుబంధు కూడా అమలు కావడం లేదని, ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 35వేల మంది రైతులకు రైతుబంధు ఇవ్వడం లేదని చెప్పారు. భూరికార్డుల ప్రక్షాళనతో పాటు కొత్త పాసుపుస్తకాలను పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనందునే ఈ ఇబ్బందులు వచ్చాయని, లోపభూయిష్ట విధానాలతో ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. రైతు సమస్యలపై పోరాటాలు చేయాలని తాము నిర్ణయించామని, పటిష్ట కార్యాచరణతో ముందుకెళ్తామని చెప్పారు. రాష్ట్ర చైర్మన్‌ అన్వేశ్‌రెడ్డి మాట్లాడుతూ రబీ ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమయిందని, ధాన్యం కొనుగోలుకు ఎన్ని గన్నీబ్యాగులు అవసరమవుతాయో కూడా ప్రభుత్వానికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. 15–20 రోజులపాటు అసలు ధాన్యమే కొనుగోలు చేయలేదని, ధాన్యం కొనుగోలు చేసిన రెండు నెలల తర్వాత కూడా డబ్బులు ఇవ్వడం లేదన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావస్తున్నా రబీ కొనుగోళ్లకు రూ.2వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ధాన్యం చెల్లింపులు రాకపోవడంతో రైతులకు పెట్టుబడి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలవుతున్నా రుణమాఫీ చేయలేదని, ఈ అంశాలన్నింటిపై ఉద్యమించాలని కిసాన్‌ కాంగ్రెస్‌ నిర్ణయించిందని చెప్పారు. 

ప్రకృతి వైపరీత్య నిధులపై శ్వేతపత్రం: శశిధర్‌రెడ్డి 
కిసాన్‌ కాంగ్రెస్‌ సమావేశానికి హాజరైన జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ మాజీ వైస్‌చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ, గత ఐదేళ్లలో ప్రకృతి వైపరీత్యాల నిధుల కింద కేంద్రం రాష్ట్రానికి రూ.1,500 కోట్ల సాయం చేసిందని, ఈ మొత్తాన్ని ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ ఐదేళ్లలో ప్రకృతి వైపరీత్యాల కింద నష్టపోయిన రైతులకు ఎంత చెల్లింపులు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రకృతి వైపరీత్యాల నష్టాల గురించి వివరాలు చెప్పేందుకు రాష్ట్రం సహకరించడం లేదని కేంద్ర బృందం చెప్పడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన చెప్పారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా