వడ్డించిన విస్తరి ముందు కూర్చున్నారు

25 Mar, 2018 02:19 IST|Sakshi

మంత్రి కేటీఆర్‌పై బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రోడ్లు, ఐటీ, బల్క్‌ డ్రగ్స్‌ పరిశ్రమలు గతంలో లేనట్లు.. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్‌ మాట్లాడారని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్‌ అమెరికాలో చదువుకుంటున్న రోజుల్లోనే రాష్ట్రంలో అపార ఉపాధి అవకాశాలున్నాయని, ఆయన వడ్డించిన విస్తరి ముందు కూర్చున్నా రని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేకున్నా ఏమీ చేయలేదన్నట్లు కేటీఆర్‌ మాట్లాడుతున్నారని.. భవిష్యత్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే అప్పుడు విపక్షంలో ఉండి ఏమీ చేయలేదని మాట్లాడాలని చురకలంటించారు. పురపాలన, పరిశ్రమల శాఖల వార్షిక బడ్జెట్‌ పద్దులపై శనివారం శాసనసభలో చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్‌ విమర్శలు చేయగా.. కిషన్‌రెడ్డి తీవ్రంగా ప్రతి విమర్శలు చేశారు. దీన్ని అధికారపక్ష సభ్యులు అడ్డుకోవడంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.

అనంతరం హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సాధన కోసం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తే అప్పటి బీజేపీ ఎమ్మెల్యేలు పదవులు అంటిపెట్టుకుని ఉన్నారని ఆరోపించారు. కిషన్‌రెడ్డి స్పందిస్తూ.. బీజేపీ జాతీయ పార్టీ అని, ఢిల్లీ నుంచి గల్లీ వరకు తమ పార్టీ స్టాండ్‌ పూర్తిగా తెలంగాణకు అనుకూలంగా ఉండేదని, అందుకే రాజీనామాల అవసరం లేదని అప్పటి పార్టీ జాతీయ అధ్యక్షుడు సూచించారని బదులిచ్చారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు