రాష్ట్ర ప్రతిపాదననే కేంద్రం అంగీకరించింది

20 Sep, 2019 01:41 IST|Sakshi

యురేనియం అన్వేషణపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: నల్లమల అడవుల్లో యురేనియం అన్వేషణకు రాష్ట్ర ప్రభుత్వం 2016లో చేసిన ప్రతిపాదననే కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సీఎం చైర్మన్‌గా వ్యవహరించే వన్యప్రాణి బోర్డు–2016 డిసెంబర్‌లో వైస్‌ చైర్మన్‌ అయిన అప్పటి అటవీ శాఖ మంత్రి జోగురామన్న అధ్యక్షతన సమావేశమై నల్లమల అడవుల్లో 2 వేల హెక్టార్లలో యురేనియం అన్వేషణకు ఆమోదం తెలిపిందని చెప్పారు. నాడు యురేనియం అన్వేషణకు ఆమోదం తెలిపిన టీఆర్‌ఎస్‌.. నేడు దానికి వ్యతిరేకం అని అసెంబ్లీలో తీర్మానాలు చేస్తూ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోందన్నారు. యురేనియం తవ్వకాలపై అన్ని వర్గాల నుంచి కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతుండటంపై కిషన్‌రెడ్డి స్పందించారు. గురువారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  

అధ్యయనం కోసమే.. 
నేషనల్‌ మినరల్‌ పాలసీలో భాగంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఖనిజ సంపద లభ్యత, వాటి నాణ్యత, ప్రయోజనాలపై అధ్యయనం జరిపేందుకు కేంద్రం యురేనియం అన్వేషణ జరుపుతోందని కిషన్‌రెడ్డి చెప్పారు. దీని లో భాగంగా నల్లమల అడవుల్లో యురేనియం ఏ స్థాయిలో ఉంది, దాని నాణ్యతెంత, భవిష్యత్తు తరాలకు అది ఏ మేరకు ఉపయోగపడుతుందన్న విషయాలపై అధ్యయనం జరిపించేందుకు అన్వేషణ మాత్రమే జరుపుతోందన్నారు. అయితే ఎక్కడా కూడా తవ్వకాలకు ఎలాంటి అనుమతులివ్వలేదని చెప్పారు. హైదరాబాద్‌లో ఎన్‌ఆర్సీ (నేషనల్‌ రిజిష్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌) చేపట్టడంపై కిషన్‌రెడ్డిని ప్రశ్నించగా.. జమ్మూ కశ్మీర్‌ తర్వాత హైదరాబాద్‌లోనే అధిక సంఖ్యలో రోహింగ్యాలున్నారని.. అక్కడ ఎన్‌ఆర్సీ చేపట్టడం అన్నది కేవలం ప్రతిపాదన మాత్రమేనని బదులిచ్చారు.

మరిన్ని వార్తలు