సికింద్రాబాద్‌ బరిలో కిషన్‌రెడ్డి!

19 Mar, 2019 04:39 IST|Sakshi

ఆయన పేరే దాదాపు ఖాయమంటున్న బీజేపీ నేతలు

మల్కాజిగిరి నుంచి రాంచందర్‌రావు

మోదీ ప్రజాదరణపైనే ఆశలు

సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై దిగ్భ్రాంతికి గురైన తెలంగాణ బీజేపీ నేతలు లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాదరణపై ఆశగా ఉన్నారు. శాసనసభ ఎన్నికల్లో మొత్తంగా ఏడు శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి సిట్టింగ్‌ సీటైన సికింద్రాబాద్‌తోపాటు నగర ఓటర్లున్న మల్కాజిగిరి స్థానంపై ఆశలు పెట్టుకుంది. సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పోటీ చేయడం దాదాపుగా ఖాయమైనట్టు తెలుస్తోంది.సిట్టింగ్‌ ఎంపీ, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ తాను బరిలో ఉంటానని ప్రకటించినప్పటికీ పార్టీ నాయకత్వం కిషన్‌రెడ్డి వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. అయితే, మంగళవారం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ మరోసారి సమావేశమై తొలివిడత అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకోనుంది.

2004లో హిమాయత్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కిషన్‌రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2008లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తరువాత 2009, 2014లో అంబర్‌పేట స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనంలో ఓడిపోయిన ముఖ్యమైన నేతలలో ఆయన కూడా ఒకరు. సికింద్రాబాద్‌ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవాలని గతంలోనే కిషన్‌రెడ్డి ప్రణాళిక రచించుకున్నప్పటికీ శాసనసభ ఎన్నికలు ముందస్తుగా రావడంతో అంబర్‌పేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. బండారు దత్తాత్రేయ ఇక్కడి నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలుపొందారు. వాజ్‌పేయి, మోదీ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ దత్తాత్రేయకు ఈసారి టికెట్‌ దక్కకపోవచ్చని, కిషన్‌రెడ్డి వైపే  ఆ పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతోందని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు.

ఇతర పార్టీల నేతలకు స్వాగతం..!
ఇతర పార్టీల్లో టికెట్‌ ఆశించి భంగపడిన నేతలకు కూడా బీజేపీ స్వాగతం పలుకుతోంది. మహబూబ్‌నగర్‌ నుంచి టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్షనేత ఏపీ జితేందర్‌రెడ్డికి ఆ పార్టీ టికెట్‌ దొరక్కపోవచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టికెట్‌ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. పెద్దపల్లి నుంచి కూడా ఒక ప్రధాన పార్టీ నేతకు టికెట్‌ దక్కనిపక్షంలో తమ వద్దకే చేరే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. నల్లగొండ, ఖమ్మం, భువనగిరి, ఆదిలాబాద్‌ తదితర స్థానాల నుంచి పోటీ చేసేందుకు బీజేపీ నుంచి ప్రముఖులెవరూ ఆసక్తి కనబరచడం లేదు.

మల్కాజిగిరి నుంచి రాంచందర్‌రావు
మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి న్యాయవాది, బీజేపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావును పోటీ చేయించేందుకు బీజేపీ నాయకత్వం మొగ్గు చూపుతోంది. రాంచందర్‌రావు 2018 శాసనసభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి రెండోస్థానంలో నిలిచారు. మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్, ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్‌ శాసనసభ స్థానాలు ఉన్నాయి. ఇవన్నీ జంటనగరాల పరిధిలో ఉండడంతో అర్బన్‌ ఓటర్లు మోదీ నాయకత్వంపై సానుకూల దృక్పథంతో ఓటు వేస్తారని బీజేపీ ఆశిస్తోంది. కరీంనగర్‌ నుంచి బండి సంజయ్, నిజామాబాద్‌ నుంచి ధర్మపురి అరవింద్, చేవెళ్ల నుంచి జనార్దన్‌రెడ్డి, పెద్దపల్లి నుంచి ఎస్‌.కుమార్, జహీరాబాద్‌ నుంచి సోమాయప్ప స్వామీజీ, మహబూబ్‌నగర్‌ నుంచి శాంతికుమార్‌ పేర్లు దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు