అప్పుడు ఎన్టీఆర్‌ను.. ఇప్పుడు ఆయన సిద్ధాంతాలను..

9 Sep, 2018 01:54 IST|Sakshi

స్వార్థ రాజకీయాలకోసం ఎంతకైనా దిగజారతారు

చంద్రబాబు అవకాశవాద పొత్తులపై కిషన్‌ రెడ్డి ధ్వజం

సాక్షి, న్యూఢిల్లీ: దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును మానసిక క్షోభకు గురిచేసి ఆయన మరణానికి కారణమైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఆయన సిద్ధాంతాలను కూడా కనుమరుగు చేయడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ సీనియర్‌ నేత కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అందులో భాగంగానే కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే, ఇప్పుడు అదే కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్వార్థ రాజకీయాలకోసం చంద్రబాబు ఎంత నీచస్థాయికైనా దిగజారతారని విమర్శించారు.

ఎన్టీఆర్‌ ప్రభుత్వంపై ఇందిరాగాంధీ చేసిన కుట్రలకు వ్యతిరేకంగా అప్పుడు బీజేపీ ఆందోళనలు చేసిందని, ఎన్టీఆర్‌కు మద్దతుగా తాను చేసిన ఆందోళనతో జైలుపాలయ్యానని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారు కాబట్టి ఆనాడు తామందరం మద్దతు ఇచ్చామని, ఇప్పుడు అదే కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు కలిస్తే తెలుగు ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఎన్టీఆర్‌ ఆశయాలకు విరుద్ధమైన కాంగ్రెస్‌తో పొత్తు ఆలోచనలను చంద్రబాబు ఉపసంహరించుకుంటే మంచిదని హితవు పలికారు. లేకుంటే చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలను ప్రజలు క్షమించరన్నారు.

ఇక కర్ణాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి అయినట్టు తెలంగాణలో తాను కూడా ముఖ్యమంత్రిని అవుతానని ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు ప్రమాదకరమని, నిజాం నిరంకుశపాలనను ఆయన తిరిగి తెలంగాణలో తీసుకురావాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. అసెంబ్లీపై రజాకార్ల జెండా ఎగురవేస్తామని చెప్పే ధైర్యం ఎంఐఎంకు వచ్చిందంటే దానికి టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలే కారణమన్నారు. మజ్లిస్‌తో కలసిఉన్న టీఆర్‌ఎస్‌తో బీజేపీకి ఎలాంటి పొత్తులు ఉండబోవని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు