రాష్ట్రంలో తండ్రీకొడుకుల ప్రభుత్వం

20 Jan, 2020 10:55 IST|Sakshi
జిల్లాకేంద్రంలో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి

ఇంత దిగజారుడురాజకీయాలు ఎప్పుడూ చూడలేదు

లక్ష మంది ఓవైసీలు వచ్చినా బీజేపీని అడ్డుకోలేరు

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌: రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం కాకుండా తండ్రీ కొడుకుల ప్రభుత్వం కొనసాగుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పట్టణంలో ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించి బస్టాండ్‌ వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావని రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పేవన్నారు. టీఆర్‌ఎస్, ఎంఐఎం ఒకవైపు, బీజేపీ ఒకవైపని అన్నారు. ఇతర పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులను బెదిరిస్తూ టీఆర్‌ఎస్‌ కుట్ర చేస్తుందని, ఇంత దిగజారుడు రాజకీయం ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పరోక్షంగా ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్‌ఎస్‌ ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు.

అధికార పార్టీ నాయకులకు ఓటర్లపై నమ్మకం లేదని కేవలం డబ్బు, ఎంఐఎం పార్టీ పైనే నమ్మకం ఉందన్నారు. 2014లో 2లక్షలు ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు కేంద్రానికి ఒక్క లబ్ధిదారుని పేరు కూడా పంపలేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిపై చర్చించేందుకు కేటీఆర్‌ తనకు ఎర్ర తివాచి పరుస్తా అన్నాడని, పేదలకు ఇళ్లు కట్టిసే తానే కేటీఆర్‌కు ఎర్ర తివాచి పరుస్తానని అన్నారు. బంగారు తెలంగాణ బదులు బంగారు కుటుంబం తయారైందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే ధర్మానికి వేసినట్లేనని, టీఆర్‌ఎస్‌కు వేస్తే అవినీతికి వేసినట్లేనని తెలిపారు. ఆయుష్మాన్‌ భారత్‌ వంటి మంచి పథకాన్ని కేంద్రం ప్రవేశపెడితే తెలంగాణాలో అడ్డుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని ఓవైసీ అన్నాడని, లక్షమంది ఓవైసీలు వచ్చినా బీజేపీ గెలుపును అడ్డుకోలేరన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దిలీపాచారి మాట్లాడుతూ పట్టణాన్ని టీఆర్‌ఎస్‌ నాయకులు కుక్కలు చింపిన విస్తరి చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బుసిరెడ్డి సుబ్బారెడ్డి, పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ బంగారు శృతి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు