ప్రజలకిస్తే రాష్ట్రానికి ఇచ్చినట్లు కాదా?

20 May, 2020 03:09 IST|Sakshi

రాష్ట్ర అకౌంట్‌లో వేస్తేనే ప్రజలకిచ్చినట్లా? 

సంస్కరణలు చేయమంటే తప్పా..లెక్కలు ఉండాలని అనడం కరెక్టు కాదా 

సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి మండిపాటు 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ అంతా బోగస్‌ అంటూ సీఎం కేసీఆర్‌ మాట్లాడిన మాటలు తీవ్ర అభ్యంతరకమైనవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ తన స్థాయి దిగజారి మాట్లాడారని, ఆయన వాడిన పదజాలం, మాటలను తెలంగాణ ప్రజలు హర్షించరని పేర్కొ న్నారు. కేంద్రానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కేసీఆర్‌ అనేక విమర్శలు చేశారని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

మంగళవారం ఢిల్లీనుంచి ఆన్‌లైన్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 1.75 కోట్ల మందికి 25 కిలోల బియ్యం ఇవ్వడం బోగస్‌ అంటారా అని ప్రశ్నించారు. ప్యాకేజీలో భాగంగా తెలంగాణకు ఆస్పత్రులు రావా? లాభం చేకూరదా? ముందుగా ప్రకటించిన ప్యాకేజీలో తెలంగాణ ప్రజలకు మేలు జరగలేదా? అని ప్రశ్నించారు. ప్రజలకిస్తే రాష్ట్రానికి ఇచ్చినట్లు కాదా? రాష్ట్ర అకౌంట్‌లో వేస్తేనే ప్రజలకిచ్చినట్లా అని ప్రశ్నించారు. 

కేంద్రానికి ఆ ఆలోచన లేదు
రాష్ట్రాలు, దేశం బాగుండాలని ఎఫ్‌ఆర్‌బీఎంలో సంస్కరణలు అమలు చేయా లని కేంద్రం అడుగుతోంది తప్ప ఎవరి నెత్తినో కత్తి పెట్టే ఆలోచన కేంద్రానికి లేదన్నారు. సంకుచిత భావనతో కేసీఆర్‌ ఉన్నా రన్నారు. తాము చెప్పిన పంట వేయకపోతే రైతుబంధు ఇవ్వమని సీఎం కేసీఆర్‌ రైతుల్ని బెదిరించడం ఫ్యూడలిజం, నియంతృత్వం కాదా? అని ప్రశ్నించారు. సబ్సిడీలు ఇవ్వొ ద్దని చెప్పడం లేదని, లెక్కలు స్పష్టంగా ఉండాలని, ఎవరికి ఎంత ఎలా ఇస్తున్నారో వెల్లడించాలని కేంద్రం అడుగుతోందని పేర్కొ న్నారు.

దుబారా ఉండొద్దని, అవి నీతిని నిర్మూలించాలని చెబుతోందన్నారు. సంస్కరణలు అంటే ఇవేనన్నారు. ప్రస్తుత కష్ట కాలంలో ప్రజల కష్టాలు చూడాలే తప్ప రాజకీయాలు వద్దని హితవు పలికారు. ప్రజల కోసం కేంద్రం ప్యాకేజీ ప్రకటిస్తే విమర్శిస్తూ బాధ్యతరహితంగా వ్యవహరిస్తున్నారన్నారు. పశు సంపద కోసం పెట్టే డబ్బు, మత్స్య కార్మికుల కోసం వెచ్చించే డబ్బు తెలంగాణకు రాదా? మీరు నిర్మించిన శీతల గిడ్డంగుల్లో కేంద్ర డబ్బు ఉందో లేదో లెక్క చెప్పగలరా అని ప్రశ్నించారు. శాంతి భద్రత అంశం రాష్ట్ర పరిధిలోనిదని, బైంసా ఘటన విషయంలో రాష్ట్రం అడిగితే పారామిలటరీని పంపిస్తామన్నారు.

>
మరిన్ని వార్తలు