యాదాద్రి ఉదంతం : కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి ఫైర్‌

8 Aug, 2018 13:50 IST|Sakshi
పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న కిషన్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: నేరాలను అదుపులోకి తెచ్చాం,  ప్రజలకు రక్షణ కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ వ్యవస్థ దేశంలోనే గొప్పగా పనిచేస్తోందని చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం యాదగిరిగుట్టలో చోటుచేసుకుంటున్న బాలికల అక్రమ రవాణాపై స్పందించాలని బీజేపీ సీనియర్‌ నేత కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండో తిరుపతిగా పేరొందిన యాదగిరి గుట్టలో ఇలాంటి అసాంఘిక , అమానవీయ వ్యభిచార ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. హార్మోన్‌ ఇంజక్షన్లు ఇచ్చి చిన్నపిల్లలను వ్యభిచార వృత్తిలోకి దింపడం క్షమించరాని నేరమని అన్నారు.

ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే కిడ్నాప్‌, అపహరణ కేసులను పోలీసులు తేలిగ్గా తీసుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 2,283 మంది చిన్నారులు కనిపించకుండా పోయారనీ, ఇంకా 912 చిన్నారుల ఆచూకీ లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు తలెత్తకుండా ‍ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

రైతులకు సమాధానమేదీ..?
ఎస్సారెస్పీ ప్రాజెక్టు కింద లక్ష ఎకరాలకు నీళ్లిస్తామని 2017లో ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, రైతులకు నీరివ్వకపోతే పాపం చేసినట్టేనని వ్యాఖ్యానించారని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. మరి పంటలకు సాగునీరు లేక రోడ్డెక్కిన రైతన్నలకు కేసీఆర్‌ నేడు ఏం సమాధానం చెబుతారని ఎద్దేవా చేశారు. మిషన్‌ భగీరథ ప్రాజెక్టు కోసమే రైతులకు నీరివ్వడం లేదని ఆరోపించారు.

మరిన్ని వార్తలు