కూటమి అధికారంలోకి వస్తే రోజుకో ప్రధాని

1 Feb, 2019 10:36 IST|Sakshi

బీజేపీ నేత కిషన్‌రెడ్డి ఎద్దేవా 

నల్లగొండ టూటౌన్‌: దేశాన్ని 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ రైతుల సంక్షేమాన్ని విస్మరించి, లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడిందని బీజేఎల్పీ మాజీ నేత జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మళ్లీ అధికారంకోసం తాపత్రయ పడుతున్న కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన కూటమిలో 9 మంది ప్రధాని అభ్యర్థులున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీల మహాకూటమి అధికారంలోకి వస్తే రోజుకొక ప్రధాన మంత్రిని చూడాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.  నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఆ కూటమిలో మమత, మాయావతి, చంద్రబాబు , అఖిలేష్‌లాంటి వారు 9 మంది ప్రధానమంత్రి పదవి కోసం పాకులాడుతున్నారని అన్నారు. వైరి పక్షాలుగా ఉన్న చంద్రబాబు, రాహుల్‌ గాంధీలు ఒకే వేదిక పంచుకొని ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్నారని, రాష్ట్రంలో బాబు పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండి రైతులకు ఏం చేశారని ప్రశ్నించారు.

ప్రధాని మోదీ నాలుగున్నరేళ్లుగా అవినీతి రహిత పాలన అందిస్తూ దేశ ప్రజల సంక్షేమానికి, దేశాభివృద్ధికి పాటుపడ్డారని పేర్కొన్నారు. కేంద్రంలో కేసీఆర్, చంద్రబాబులు కీలక పాత్ర పోషిస్తారని వారి వారసులు కేటీఆర్, లోకేశ్‌ చెబుతున్నారని.., వారు అక్కడికి వెళితే వీళ్లు ముఖ్యమంత్రులు కావడానికి చూస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్‌ స్థానాలకు బీజేపీ పోటీ చేస్తుందని, ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతోందని తెలిపారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇప్పటివరకు మంత్రివర్గం ఏర్పాటు చేయలేదని, దేశంలో మంత్రివర్గం లేని ప్రభుత్వం ఒక్క కేసీఆర్‌ది మాత్రమేనని అన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు