సత్వర చర్యలు ఏమీ ఉండవు: కిషన్‌రెడ్డి

20 Dec, 2019 12:07 IST|Sakshi

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కారు తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)కి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీసీఏకు సంబంధించి నిబంధనలు, విధివిధానాలు పూర్తిగా ఖరారు కాలేదని పేర్కొన్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం తప్పుడు ప్రచారం నిర్వహిస్తూ విద్వేషపూరిత రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత చట్టం నిబంధనలపై ప్రతీ ఒక్కరితో చర్చించి.. అర్హులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అదే విధంగా దేశ వ్యాప్తంగా ఎన్నార్సీ అమలు గురించి కేంద్రం సత్వరమే ఎటువంటి చర్యలు తీసుకోబోవడం లేదని స్పష్టం చేశారు. 

ఆమెకైనా తెలుసా అసలు..
బీజేపీకి దమ్ముంటే సీఏఏ, ఎన్నార్సీపై ఐకరాజ్య సమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలన్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి స్పందించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ క్షేత్రస్థాయిలో బలహీనపడటం.. కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న కారణంగా మమత భయపడిపోతున్నారన్నారు. అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసలు మమత ఏం మాట్లాడుతున్నారో ఆమెకైనా తెలుసా. ఒక ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. అదే విధంగా సీసీఏకు దేశ పౌరుల ప్రయోజనాలకు ఎటువంటి భంగం కలిగించదని.. కాబట్టి ఆందోళనకారులు నిరసన విరమించాలని ఆయన కోరారు. ప్రజలను విభజించేందుకు, తప్పుదోవ పట్టించేందుకు మతాన్ని ఉపయోగించుకుంటున్నారా అంటూ మేధావులు, ప్రతిపక్షాలను ప్రశ్నించారు.(సీఏఏపై కేంద్రానికి మమత సవాలు)

మరిన్ని వార్తలు