‘వారి చావులకు కారణమయ్యారు’

3 Dec, 2018 14:04 IST|Sakshi

బీజేపీ సీనియర్‌ నేత కిషన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో వాడి- వేడి పేజీలు తగ్గాయి.. దానికనుగుణంగానే ప్రజలు కూడా ఆ పార్టీకి సీట్లు తగ్గిస్తారని బీజేపీ సీనియర్‌ నేత కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం పార్టీ కార్యలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ప్రజల్లో టీఆర్‌ఎస్‌ విశ్వనీయత కోల్పోయిందని, ఆ పార్టీకి ఓటేసేందుకు ఒక్కరు కూడా సిద్ధంగా లేరన్నారు. ‘పాత ప్రణాళికనే తారుమారు చేసి కొత్త మేనిఫెస్టో రూపొందించారు. గత మేనిఫెస్టోలో కనీసం జయశంకర్‌ ఫొటో ఉండేది. ఇప్పుడు అది కాస్తా తీసేశారు. టీఆర్‌ఎస్‌ పతనం వైపు వెళ్తోంది’  అని వ్యాఖ్యానించారు.

రైతులను అవమానించారు..
రైతులను అనేక రకాలుగా అవమానించి వారి చావులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కారణమైందని కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ అని చెప్తున్నారు.... ఈ నాలుగేళ్ళలో రుణమాఫీ సక్రమంగా చేయలేదు... కనీసం వడ్డీ కూడా ఇవ్వలేదు....రాబోయే ప్రభుత్వంలో రుణమాఫీ ఏకకాలంలో చేస్తారా లేదా అనే విషయం కూడా స్పష్టంగా చెప్పలేదని’ ఆయన విమర్శించారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కావాలని పెట్టారు... అలా కాకుండా మా ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత మంత్రి వర్గంలో మహిళలకు స్థానం కల్పిస్తామని చెప్పి ఉంటేనైనా ప్రజలు టీఆర్‌ఎస్‌ను నమ్మేవారేమోనని ఎద్దేవా చేశారు.

>
మరిన్ని వార్తలు