చంద్రబాబు హయాంలో రూ. కోటి పరిహారం ఇచ్చారా? 

10 May, 2020 04:29 IST|Sakshi

ఘటన జరిగిన 8 గంటల్లోనే బాధితులను సీఎం పరామర్శించారు

గ్యాస్‌లీక్‌ ప్రభావిత గ్రామాల ప్రజలకు హెల్త్‌ కార్డులు 

రానున్న రోజుల్లో బాబు ప్రతిపక్ష హోదా పోతుంది 

పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఫైర్‌  

సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో ఎల్‌జీ పాలిమర్స్‌ లో జరిగిన గ్యాస్‌లీక్‌ ఘటనలో 12 మంది చనిపోవడం దురదృష్టకరమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (కొడాలి నాని) ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకునే ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కోటి రూపాయల ఆర్థిక సాయం ఇచ్చారన్నారు. దేశంలో ఇప్పటి వరకు మృతుల కుటుంబాలకు ఇంత పెద్ద ఆర్థిక సాయం చేసిన సీఎం జగన్‌ మాత్రమేనన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పలుచోట్ల చాలా ఘటనలు చోటు చేసుకొని చాలా మంది చనిపోయారు. ఎప్పుడైనా మృతి చెందిన ఒక్కరంటే ఒక్కరికి రూ. కోటి పరిహారం ఇచ్చారా అని నిలదీశారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మరో మంత్రి పేర్ని నానితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..  

► విషవాయువు వ్యాపించిన గ్రామాల్లో ప్రతి కుటుంబానికి ఆర్థికసాయం అందిస్తాం. హెల్త్‌ కార్డులు జారీ చేసి వారికి దీర్ఘకాలం వైద్యసేవలు అందేలా చూస్తాం.  
► 1998లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అదే కంపెనీలో అగ్నిప్రమాదం జరిగితే ఎందుకు మూయించలేదో సమాధానం చెప్పాలి.  హిందూస్థాన్‌ పాలిమర్‌ను.. ఎల్‌జీ పాలిమర్స్‌గా మార్చింది, అందుకు బ్రోకర్‌గా వ్యవహరించింది బాబునే. 2017లో కూడా కంపెనీ విస్తరణకు పర్మిషన్‌ ఇచ్చిందీ ఆయనే.  
► గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు ప్రచార సినిమా షూటింగ్‌ వల్ల 30 మంది చనిపోయారు. వాళ్లు బతికొస్తారనే చంద్రబాబు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చారా? పరిహారంపై గతంలో ఒక విధంగా.. నేడు మరొకలా బాబు మాట్లాడుతున్నారు. 
► ఇప్పటికైనా బాబు లుచ్చా మాటలు ఆపి ఆక్సిజన్‌ పెట్టుకుని హైదరాబాద్‌లోని అద్దాల కొంపలో కూర్చొంటే బాగుంటుంది. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి.  
► గ్యాస్‌ లీక్‌ ఘటనను నిపుణుల కమిటీ పరిశీలిస్తోంది. ప్రజల భద్రతే మాకు ముఖ్యం. ఫ్యాక్టరీ వల్ల ప్రమాదముందని నివేదిక వస్తే చర్యలు తీసుకుంటాం. బాబు టీడీపీకి చెందిన దద్దమ్మలతో డ్రామా కమిటీ వేశారు.  
► ఎల్‌జీ కంపెనీతో కుమ్మక్కు కావాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. రానున్న రోజుల్లో చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా కూడా పోతుంది.   

మరిన్ని వార్తలు