సిగ్గుంటే టీడీపీని వదిలేయాలి

31 May, 2020 04:53 IST|Sakshi

దమ్ముంటే లోకేష్‌ చేత ‘సీబీఎన్‌ టీడీపీ’ అని పెట్టించి ఎన్నికలకు రావాలి

జగన్‌ను విమర్శించే స్థాయి బాబు, లోకేష్‌లకు లేదు

పిజ్జాలు, బర్గర్లు, ఐస్‌క్రీములు లేక లోకేష్‌ బరువు తగ్గాడు

మంత్రి కొడాలి నాని ధ్వజం 

గుడివాడ రూరల్‌: చంద్రబాబుకు సిగ్గు, శరం ఉంటే ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఆయన కుమారులకు వదిలేసి, దమ్ము, ధైర్యం ఉంటే తనయుడు లోకేష్‌తో సీబీఎన్‌ టీడీపీని స్థాపించి 2024 ఎన్నికలకు రావాలని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సవాల్‌ విసిరారు. స్థానిక మార్కెట్‌ యార్డ్‌ వద్ద శనివారం మంత్రి విలేకర్లతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా నాయకుడని, ఆయన పార్టీ పెట్టి ప్రజల మధ్యకు వెళ్తే ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారని, ఆ తర్వాత రికార్డు స్థాయిలో 151 సీట్లతో ముఖ్యమంత్రిని చేశారన్నారు. జగన్‌ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు, కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని చవట దద్దమ్మ నారా లోకేష్‌కు లేదని మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... 

► 2014లో అధికారంలోకి వచ్చే ముందు పూర్తిగా మారిపోయానని, రూ.87వేల కోట్ల రైతు రుణాలు రద్దు చేస్తానని, హైటెక్‌ నుండి రైతు పక్షపాతినయ్యానంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను పూర్తిగా మోసం చేసిన వెన్నుపోటుదారుడిగా చంద్రబాబునాయుడు మిగిలిపోయారు.  
► రైతుల రుణాలను కేవలం రూ.12వేల కోట్లను మాత్రమే మాఫీ చేసి చేతులు దులుపుకున్న చవట దద్దమ్మ. అన్నం పెట్టే రైతును మోసం చేయగల్గిన చంద్రబాబు ఎంతటి నీచానికైనా దిగజారతాడని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. 
► గత ఎన్నికలకు ముందు రైతులకు రూ.12,500లు చొప్పున నాలుగేళ్ల పాటు రైతు భరోసాగా ఇస్తానని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. తర్వాత దాన్ని రూ.13,500 పెంచి ఇస్తూ వస్తున్నాం. ఎక్కడా రైతులను మోసం చేసే ఉద్దేశ్యం తమ ప్రభుత్వానికి లేదు. 
► లాక్‌డౌన్‌ కాలంలో 20 కేజీలు తగ్గానని మహానాడులో లోకేష్‌ చెప్పుకున్నాడు. పిజ్జాలు, బర్గర్‌లు, ఐస్‌క్రీంలు లేక తగ్గినట్టు ఉన్నాడు.   
► ఎన్ని అడ్డంకులు వచ్చినా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అడుగు ముందుకే పడుతుంది. వెనక్కి వేయించగల దమ్ము, ధైర్యం ఉన్న శక్తులు, వ్యక్తులు రాష్ట్రంలో ఎవరూ లేరు. ఒక కోర్టులో అన్యాయం జరిగితే పైకోర్టుకు వెళ్లడం సర్వ సాధారణం. మేమూ అదే చేస్తాం.

మరిన్ని వార్తలు